వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో.... కొవిడ్ పరీక్షల వెల్లడిలో ఆలస్యం.. ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోంది. నమూనాలిచ్చి వారం రోజులవుతున్నా... ఫలితాలు తెలియకపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. ముఖ్యంగా రోజుకు వేయికిపైగా కేసులు నమోదవుతున్న చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిత్తూరు జిల్లాలో నమోదయ్యే కేసుల్లో సగానికి పైగా తిరుపతిలోనే వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ రోజుకు 5 నుంచి 6 వేల వరకూ నమూనాలు సేకరిస్తుండగా..ఫలితాలు వెల్లడిస్తున్న సంఖ్య మూడు వేల లోపే ఉంటోంది. దీని వల్ల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం కనిపిస్తోంది. ఈ ఆలస్యంతో... నమూనాలిచ్చిన వారు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు..తిరుపతిలోని జాతీయస్థాయి విద్యాసంస్థ ఐసర్ పరిశోధనశాలను కొవిడ్ పరీక్షల కోసం తీసుకున్నారు. వీలైనంత త్వరగా కొవిడ్ పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తామని అధికారులు చెబుతున్నారు.