sand mines subleased : రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు సామాన్యులే కాదు.. సబ్‌లీజుకు తీసుకున్న వ్యాపారులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్న ఈ దందాలో ఇరుక్కుని చిన్నాచితకా వ్యాపారులు ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. ఇసుక మాఫియా లక్ష్యాలను చేరుకోలేక, వారు డిమాండ్ చేసినంత ఇచ్చుకోలేక తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. సీఎం సొంత జిల్లాలో ఇప్ప్పుడు మరో చిరు వ్యాపారి ఆత్మహత్యకు యత్నించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి.
ఇసుక మాఫియా దారుణాలు అనేకం జేపీ సంస్థ పేరుతో... ఇసుక వ్యాపారంలో పేరు జేపీ సంస్థదే అయినా.. నిర్వహణ, దండుకోవడం మొత్తం వైఎస్సార్సీపీ నాయకులే అనేది జగమెరిగిన సత్యం. సీఎం జగన్ సొంత జిల్లాలో ఆయన సమీప బంధువే అనుమతుల్లేని ఇసుక రీచ్‌కోసం డబ్బులు కట్టించుకుని.. తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడంటూ పోకల నారాయణరెడ్డి అనే వ్యాపారి ఆత్మహత్యకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక దోపిడీని కళ్లకు కడుతోంది. ఐదారుగురు వ్యాపారులు కలిసి ఇసుక రీచ్ ను తన వద్ద సబ్ లీజుకు తీసుకున్నారంటూ సీఎం బంధువు వీరారెడ్డి బాహాటంగా అంగీకరించటం ఆయన బరితెగింపుతనానికి నిదర్శనం. సొంత జిల్లాలో ఈ స్థాయిలో దారుణాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం నోరు మెదపడం లేదు. జేపీ సంస్థకు రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని ఇచ్చేశామని చెప్తూ.. వారు ఎవరికి సబ్‌లీజు ఇచ్చుకున్నా తమకు సంబంధం లేదంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు.
వేధింపులు తాళలేక.. ఇసుక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టివైఎస్సార్సీపీ నాయకుల వేధింపులు తాళలేక ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రేమ్‌రాజ్ ఆత్మహత్యకు పాల్పడగా.. ఇప్పుడు సీఎం సొంత జిల్లాలో నారాయణరెడ్డి బలవన్మరణానికి యత్నించాడు. జగన్ సమీప బంధువు, ఇసుక వ్యాపారి వీరారెడ్డే తన ఆత్మహత్యకు కారణం అని తెలిపాడు. వాస్తవానికి రాష్ట్రంలో ఇసుక వ్యాపారం జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ప్రధాన కాంట్రాక్టర్‌గా, టర్న్‌కీ సంస్థ సబ్ కాంట్రాక్టర్ గా సాగుతున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉంటుంది. ఇసుక కొనుగోలుదారులకు రసీదులు ఆ రెండు సంస్థల పేరిట ఇస్తున్నారు.
పార్టీ పెద్దల కనుసన్నల్లో... కానీ దందా అంతా రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్సీపీ ‘ముఖ్య నేతలు’, ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారు. జిల్లాల వారీగా ఆ బాధ్యతలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, వారి బంధువులు కొనసాగిస్తున్నారు. ఆ మేరకు వారి నుంచి ముందస్తుగానే కోట్లలో అడ్వాన్సులు తీసుకుని నెలవారీగా ఎంత చెల్లించాలో లక్ష్యాలు సైతం నిర్దేశించారు. ఈ నేపథ్యాన జిల్లా స్థాయిలో ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్న నాయకులు.. ‘ముఖ్య నేతలకు’ నెలవారీ కట్టాల్సిన డబ్బుతో పాటు, వారు మరింత సంపాదించేందుకు మరో అడుగు ముందుకేశారు. వారు కిందిస్థాయిలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఇతర వ్యాపారులకు సబ్ లీజుకు ఇచ్చి దందా నడిపిస్తున్నారు. అన్ని స్థాయిల్లో జరుగుతున్న దోపిడీయే ఇప్పుడు ఆత్మహత్యలకు కారణమవుతోంది.
అత్యధికంగా ఇసుక విక్రయాలు జరిగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.35 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.18 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.17 కోట్లు, శ్రీకాకుళానికి రూ.16 కోట్లు.. ఇలా ప్రతి జిల్లాకు నెలవారీ లక్ష్యాలు పెట్టి వసూలు చేస్తున్నారు. వీటిలో అత్యధిక చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే కీలకపాత్ర వహిస్తున్నట్లు సమాచారం.