ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్యావసరం.. మూడు నెలల్లో ధరా ఘాతం!

పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నా.. మనిషికి కావాల్సిన కనీస అవసరాలు తీరాల్సిందే. అందులో ప్రధానంగా ఆహారానికి సంబంధించిన నిత్యావసరాలు తప్పక కొనుగోలు చేయాలి. ప్రస్తుతం వాటి ధరలు కొండెక్కికూర్చున్నాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చిన ప్రతిసారీ సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. ధరలు పెరిగినంత వేగంగా ఆదాయ వనరులు పెరిగే అవకాశం లేకపోవడం.. అలాగని అవసరాలు తీర్చుకోకుండా ఉండలేని దైన్యం వాళ్ల జీవితాలను ఒడుదొడుకులకు గురిచేస్తోంది. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తుంటే.. ప్రభుత్వం నిర్ణయించిన వాటికంటే అధిక ధరలు విక్రయిస్తున్నవారిపై అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దీంతో పేదల జీవనయానం దయనీయంగా మారింది. ధరల పెరుగుదలపై కృష్ణా జిల్లా కలిదిండి ప్రజల స్పందన మీరే చదవండి.

By

Published : Jan 24, 2021, 5:38 PM IST

Commodities price hikes
ధరా ఘాతం

గతేడాది ఏప్రిల్‌ నెల నుంచి కరోనా నేపథ్యంతో నిత్యావసరాలు, కూరగాయల ధరల్ని నియంత్రించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చొరవ తీసుకుని అన్నింటికీ నిర్ణీత ధరల్ని నిర్ణయించింది. వాటిని అమలు చేసే బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పగించింది. వాటిపై విస్తృత ప్రచారాన్నీ చేసింది. ఆ ప్రయత్నం అంతంత మాత్రంగానే ఫలించింది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగింది. పనుల్లేక అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నా.. రెక్కలు తొడిగిన ధరల తాకిడికి మరింత కుదేలవ్వాల్సి వచ్చింది. పప్పు, ఉప్పు, చింతపండు, మంచినూనె ఇలా ఏది కొనాలన్నా.. గుబులు పుడుతోంది.

ధరా ఘాతం

వ్యాపారంలో ఒడుదొడుకులు..

మేము టిఫిన్‌ సెంటరు నిర్వహించుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతం కావడం వల్ల పరిమిత ధరలకే అమ్మకాలు చేయాల్సి వస్తోంది. అల్పాహారం తయారు చేయడానికి అయ్యే ఖర్చు మాత్రం నానాటికీ రెట్టింపవుతున్నాయి. వాటికి పెట్టుబడి పెట్టి.. ఇతర ఖర్చులను భరించి కష్టాన్ని ధారపోసిన తర్వాత పెద్దగా లాభాలు రాని పరిస్థితి. మినపపప్పు, నూక, శనగపప్పు, మైదాపిండి, చింతపండు, మంచినూనె తదితరాలు ధరలు భారీగా పెరిగాయి. - పేపకాయల భవాని, టిఫిన్‌ సెంటర్‌, కోరుకొల్లు

ధరలు నియంత్రించాలి

సామాన్యుడు కడుపునిండా తినాలంటే నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండాలి. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరించాలి. అధికారులు తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ధరల్ని కట్టడి చేయడం సాధ్యంకాదు. అడ్డగోలుగా అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మిగిలినవాళ్లు కాస్త చూసుకుని అమ్ముతారు. - నంద్యాల నాగమణి, గృహిణి, కలిదిండి

భయమేస్తోంది..

ఇంటింటికీ తిరుగుతూ ప్లాస్టిక్‌ సామగ్రి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఏ రోజు అమ్మకాలు జరగకపోయినా ఇల్లు గడవడం కష్టమవుతుంది. వచ్చిన ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలను చూస్తుంటే భయమేస్తోంది. డబ్బును పొదుపు చేసే అవకాశం ఎటూ లేదు. కనీసం ముఖ్యమైన అవసరాలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎదురవకుండా ఉంటే చాలనిపిస్తుంది. అధిక ధరల వల్ల అదీ సాధ్యం కావడంలేదు. మున్ముందూ ఇలా ధరల పెరుగుదల కొనసాగితే బతుకు మరింత భారంగా మారుతుంది. - కత్తుల కుమారి, ప్లాస్టిక్‌ సామగ్రి విక్రేత, కలిదిండి

కృష్ణా జిల్లాలో పరిస్థితి...

రైతు బజార్లు : 24

కిరాణా దుకాణాలు : 4,800

కూరగాయల దుకాణాలు : 3,100

ఇదీ చదవండి:'రాష్ట్రంలో జగన్ పోలీస్ వ్యవస్థ నడుస్తోంది'

ABOUT THE AUTHOR

...view details