కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు భారత సరిహద్దు గాల్వన్‌లో చైనా సైనికులతో పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు... తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. అంతకముందు అశ్రునయనాల మధ్య కల్నల్ సంతోష్‌బాబు అంతిమయాత్ర కొనసాగింది. సూర్యాపేట విద్యానగర్‌లోని సంతోష్‌బాబు నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో దారిపొడవునా వేలాదిమంది ప్రజల అశ్రునివాళి అర్పించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ప్రజల అశ్రునివాళి
భారత్ మాతాకీ జై...అమర జవాన్... సంతోష్‌బాబుకి జోహార్ అనే నినాదాలతో... సూర్యాపేట పురవీధులు మారుమోగాయి. భవనాలపై నిలబడిన ప్రజలు... సంతోష్‌బాబు పార్ధీవదేహం పూలు చల్లుతూ నివాళి అర్పించారు. సూర్యాపేట విద్యానగర్ నుంచి కేసారం వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతుబజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా సాగిన అంతిమయాత్రలో దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోశ్‌బాబుకి జనం జేజేలు పలికారు.
అమర జవానుకు తుది వీడ్కోలు
కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సంతోష్‌బాబు అంతిమ సంస్కారాలు జరిగాయి. 16 బిహార్ రెజిమెంట్ బృందం సైనిక లాంఛనాలను నిర్వహించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అమర జవానుకు తుదివీడ్కోలు పలికారు.
తండ్రి ప్రోత్సాహంతో...
సూర్యాపేటకు చెందిన సంతోశ్‌బాబు చిన్ననాటి నుంచే తండ్రి ఉపేందర్ ప్రోత్సాహంతో సైన్యంలో చేరడమే లక్ష్యంగా పెరిగారు. కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి... శిక్షణ పూర్తయ్యాక సైనికుడిగా విధుల్లో చేరారు. మొత్తం 15 ఏళ్లపాటు సర్వీసులో ఉన్నారు. 2007లో పాకిస్థాన్ బోర్డర్‌లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించి దేశ రక్షణలో భాగస్వామ్యమయ్యారు. ఏడాదిన్నరగా చైనా సరిహద్దులో విధులు నిర్వహించారు. సోమవారం రాత్రి భారత్-చైనా సైనికుల మధ్య గాల్వన్‌లో జరిగిన ఘర్షణలో సంతోష్‌బాబు అమరుడయ్యారు.
కల్నల్ సంతోష్‌బాబుకు భార్య, తొమ్మిదేళ్ల కుమార్తె అభిజ్ఞ, నాలుగేళ్ల వయసున్న తనయుడు అనిరుధ్ ఉన్నారు. కల్నల్ సంతోశ్ సొంతూరుతోపాటు అత్తగారి ఊరు కూడా సూర్యాపేటనే. వీరమరణం పొందిన కల్నల్ తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకు విశ్రాంత మేనేజరు కాగా... ఆయన మామ విశ్రాంత ఉపాధ్యాయుడు. త్వరలో హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ మీద రావాల్సిన సంతోష్‌బాబు.... సరిహద్దుల్లో దేశం కోసం అసువులు బాశారు.
దేశం కోసం అసువులు బాసి కోట్లాది మంది భారతీయుల్లో తెగువను నింపిన కల్నల్ సంతోష్‌బాబు త్యాగాన్ని..... యావత్ భారతావని స్మరించుకుంది. అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికింది.
ఇదీ చదవండి:
త్యాగాల వెనుక కదిలించే గాథలు