కృష్ణా జిల్లాలో కరోనా కేసులు ఐదు వేలకు సమీపిస్తుండటం.. అందులోనూ విజయవాడలోనే అత్యధిక కేసులు నమోదవుతోన్న తరుణంలో అధికారులు వైరస్ వ్యాప్తి నిరోధానికి 11 ప్రాంతాలను గుర్తించారు. వైరస్ కట్టడి చేసేందుకు ఆయా ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. విజయవాడలోని కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్.. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సంయుక్త కలెక్టరు మాధవీలత, కంటెయిన్మెంట్ జోన్‌ల ఇన్‌ఛార్జి అధికారి వెంకటరావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను కట్టడి చేసి.. అక్కడి ప్రజలకు పరీక్షలు చేస్తే వ్యాప్తిని తగ్గించొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. వారం రోజులపాటు పగడ్భందీగా బారికేడింగ్ చేసి ప్రజలందరూ ఒకే దారి నుంచి వచ్చి, తిరిగి అదే దారి వెంట వెళ్లేలా జియోగ్రాఫికల్ క్వారంటైన్‌కు ఆదేశించారు.