నూజివీడులో సంక్రాంతి పందేలకు సిద్ధమవుతున్న పుంజులు cock fights in nuziveedu: కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో శతాబ్దాలుగా కోడి పందేల సంస్కృతి ఉంది. పౌరుషంతో ఉండే పుంజులు ఒక్కసారి బరిలోకి దిగితే హోరాహోరీగా తలపడతాయి. సంక్రాంతి పందేల కోసం ఏడాది పొడవునా వీటిని పెంచి పోషిస్తుంటారు. జీడిపప్పు, బాదం, పిస్తాలతో కూడిన ప్రత్యేక ఆహారాన్ని పెడతారు. ఈత కొట్టడం, పరుగులు తీయడం వంటి వాటిలోనూ తర్ఫీదునిస్తారు. కాళ్లకు కత్తులు కట్టాక పోరాడే తీరునూ నేర్పిస్తారు. కోడి పందేలు లేని సంక్రాంతి లేనట్టే అన్నంతగా.. కోస్తాంధ్ర వాసులు వీటికి ఆకర్షితులవుతారు.
పుంజుల్లో డేగ, నెమలి, కాకి ఇలా అనేక జాతులు పోటీలకు సిద్ధంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల్లో జూదాలూ జరుగుతుంటాయి. అయితే అనాదిగా వస్తున్న సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నామని.. దీనికి జీవహింస లాంటి పేర్లు పెట్టొద్దని కోళ్ల పెంపకందారులు కోరుతున్నారు.
పందెం కోళ్ల చరిత్ర..
రాణి రుద్రమదేవి కాలం నుంచి నూజివీడు సంస్థానం ప్రాంతంలో కోడి పందాలు సాగుతున్నాయని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి వచ్చిన కోళ్ల పందాల సంప్రదాయం పల్లె సంస్కృతిలో భాగమయింది. పందేల కోసం.. ఏడాది పొడుగునా వీటిని పెంచి పోషిస్తారు. కోడిపందాలు జూదంగా మారి, రూ.లక్షల కోట్లు పందెంరాయుళ్ల చేతులు మారడం సర్వసాధారణమైపోయింది.
పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ..
పందేలకు వినియోగించే కోడిపుంజులకు.. ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అనాదిగా వస్తోంది. ప్రారంభం నుంచి నూజివీడు ప్రాంతంలో జీడిపప్పు, బాదం, పిస్తాలతో కూడిన ప్రత్యేకమైన ఆహారాన్ని కోడిపుంజులకు అందిస్తారు. వీటికీ.. వేగంగా ఈత కొట్టడం, పరుగులు తీయడం వంటి శిక్షణలు ఇస్తారు. ఎదురెదురుగా కోడి పుంజులు ఉంటే పోట్లాడే తీరు, ప్రత్యర్థి కోడిపుంజును మట్టి కల్పించే నైపుణ్యాలను నేర్పిస్తారు. అంతిమంగా కాళ్లకు కత్తులు కడితే ప్రత్యర్థి పుంజు కుత్తుక కోయడం లాంటివి నేర్పుతారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షకులు, అనువైన ప్రాంతాలను ఏర్పాటు చేస్తారు. శిక్షణ ప్రాంతానికి చుట్టూ పటిష్టమైన భద్రత కల్పిస్తారు.
పందాలకు వినియోగించే పుంజుల రకాలు..
పందెపు కోడిపుంజులలో చాలా రకాలుంటాయి. పండు డేగ, డేగ, నెమలి, కాకి, కాకి నెమలి, రసంగి, సేతువ, అబ్రాసు, వంటి అనేక రకాలను పోటీల కోసం వినియోగిస్తారు. ముందుగానే వీటిని ఎంపిక చేసుకొని శిక్షణ ఇచ్చి పందెం బరిలోకి దింపుతున్నారు.
కోట్లు గుమ్మరిస్తారు..
కోడి పుంజులను బరిలోకి దింపే పందెం రాయుళ్లు.. ఇంతకుముందు లక్షల్లో బెట్టింగ్ కాసేవారు. ప్రస్తుతం అది రూ.కోట్లకు చేరింది. కోళ్ల పందేల్లో మిమిక్రీ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.
ఇదీ చదవండి:Women Attack on Wine Shop: మద్య నిషేధం అమలెక్కడ ?: వంగలపూడి అనిత