మిడతల దండు తెలంగాణలో ప్రవేశించకుండా చూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అవి రాష్ట్రంలోకి వస్తే ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, ఫెస్టిసైడ్లను సిద్ధంగా ఉంచినట్లు కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్ - మిడతల అంశంపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా భయంతో భయాందోళన చెందుతున్న తెలంగాణకి ఇప్పుడు మిడతల టెన్షన్ పట్టుకుంది. మిడతల దండు రాష్ట్రంలోకి దూసుకురాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాజస్థాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. అక్కడి నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒకవేల గాలి..
గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేల గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని తేల్చారు. తక్కువ అవకాశాలున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.