ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపాపై కేసీఆర్ టార్గెట్.. నేడో రేపే దిల్లీకి పయనం! - టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం

TRS MLAS trap issue: ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాల అంశంపై దిల్లీ వేదికగా భాజపాపై విరుచుకు పడేందుకు సీఎం, తెరాస అధ్యక్షుడు కేసీఆర్​ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భాజపా జాతీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దూకుడు పెంచేలా వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. గంటల కొద్ది వీడియో, ఆడియో రికార్డింగులను స్వయంగా వింటున్న కేసీఆర్​.. పూర్తి ఆధారాలతో ఎదురుదాడి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల విచారణలో పోలీసులు కీలక ఫోన్ సంభాషణలను సేకరించినట్లు సమాచారం.

CM KCR
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్

By

Published : Oct 28, 2022, 9:58 AM IST

భాజపాను బిగించేందుకు కేసీఆర్​ వ్యూహాలు

CM KCR Preparing attack for BJP: ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాల అంశాన్ని దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్​ వ్యూహ రచన చేస్తున్నారు. భాజపా కీలక నేతలే ప్రధాన లక్ష్యంగా దిల్లీ వేదికగా విరుచు పడేందుకు సిద్ధమవుతున్నారు. దిల్లీ వెళ్లి నేడు లేదా రేపు అక్కడే మీడియా సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను తెరాస నాయకత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఓ వైపు భాజపా విమర్శల దాడి చేస్తున్నప్పటికీ.. గులాబీ పార్టీ ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉన్నందున పార్టీ నాయకులెవరూ మాట్లాడవద్దని కేటీఆర్​ ట్వీట్ కూడా చేశారు. స్వయంగా కేసీఆర్​ దిల్లీ వేదికగానే అన్ని విషయాలు బయటపెడతారని తెరాస శ్రేణులు చెబుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు రెండు రోజులుగా ప్రగతిభవన్‌లోనే ఉన్నారు. కేటీఆర్​, హరీశ్​రావుతో కేసీఆర్​ సమాలోచనలు జరుపుతున్నారు. పూర్తి ఆధారాలను సిద్ధం చేసే పనిలో ప్రగతిభవన్ వర్గాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫాంహౌస్‌లో గంటల కొద్ది వీడియో రికార్డయినట్లు సమాచారం. అదేవిధంగా దాదాపు పది రోజులుగా ఎమ్మెల్యేల ఫోన్లలో సుమారు ఆరు గంటల ఆడియో రికార్డులు ఉన్నట్లు చెబుతున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల ఫోన్లలోనూ కీలక సంభాషణలు పోలీసుల విచారణలో బయటపడినట్లు సమాచారం. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో నేతల బేరసారాలు, పార్టీలోని కీలక నేతల ప్రమేయం, సీబీఐ, ఈడీ కేసుల ప్రస్తావన వంటివి ఆడియో, వీడియోల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఆడియో, వీడియో రికార్డింగులన్నీ రెండు రోజులుగా కేసీఆర్​ స్వయంగా వింటున్నట్లు సమాచారం. వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నివేదికలు, ఆడియో, వీడియోలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా కుట్ర పన్నిందని.. వివిధ పార్టీల నేతలతో ఫోన్లో చర్చిస్తున్న కేసీఆర్​.. జాతీయ స్థాయిలో ఉద్యమానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మునుగోడు ఉపఎన్నికల్లో విజయంపై ధీమాతో ఉన్న కేసీఆర్​.. బేరసారాలను ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రయోగించనున్నారు. ఈనెల 30న మునుగోడు నియోజకవర్గం చండూరులో జరిగే సభలో కేసీఆర్​.. ఉద్వేగభరితంగా ప్రసంగిచండంతో పాటు భవిష్యత్తు కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details