అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండో రోజు సమాలోచనలు జరిపారు. మొదటి రోజు సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం... నిన్న దానికి కొనసాగింపుగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, న్యాయనిపుణులతో చర్చించారు.
బుధవారం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సిద్ధం చేసిన సమాచారం, వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వాటికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమైక్య రాష్ట్రంలో తీరని అన్యాయం జరిగిందని... దాన్ని సరిదిద్దకుండా ఉండడం ఏ మేరకు సబబని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నదీజలాల్లో కేటాయింపులు చేయాలని కోరుతూ సెక్షన్ త్రీ ప్రకారం కోరినా కేంద్రం స్పందించలేదని... గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అదనపు వాటా రావాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.