ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలంగాణపై కక్షకట్టిన కేంద్రం.. అడుగడుగునా ఆర్థిక దిగ్బంధం' - KCR fires on Central Government

KCR fires on Central Government : కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ ఆర్థిక విధానాలు, తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రగతి మాత్రమే కాకుండా దేశ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రేరేపిత, కక్షపూరిత దిగజారుడు విధానాలతో రాష్ట్రాల గొంతు కోస్తూ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని ఆక్షేపించారు. కేంద్ర కుట్రపూరిత విధానాలు రాష్ట్ర ప్రగతికి ఆటంకం శాసనసభ వేదికగా ఎండగడతామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌

By

Published : Nov 25, 2022, 9:18 AM IST

'తెలంగాణపై కక్షకట్టిన కేంద్రం.. అడుగడుగునా ఆర్థిక దిగ్బంధం'

KCR fires on Central Government : కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత విధానాలతో రాష్ట్రాన్ని అడుగడుగునా ఆర్థిక దిగ్బంధనం చేసి.. ప్రగతికి అడ్డుపుల్లలు వేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అనతికాలంలోనే అన్ని రంగాల్లో అత్యద్భుత పురోగతితో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రతిభను పలచన చేయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం తప్పుడు విధానాలు దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉందన్నారు. వీటిని శాసనసభ వేదికగా దేశ, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. శాసనసభ సమావేశాల ఖరారు కోసం గురువారం ప్రగతిభవన్‌లో అందుబాట్లో ఉన్న మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు.

అసంబద్ధ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్రాల భవిష్యత్తుకు, ప్రగతికి ఆటంకంగా మారుతుందని సీఎం అన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్‌ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ బడ్జెట్‌ను రూపొందించు కుంటున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని రూ.54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించిందన్నారు. దీనిని అనుసరించి రాష్ట్రం బడ్జెట్‌ రూపొందించుకుంటుందన్నారు. కాగా, కేంద్రం అకస్మాత్తుగా రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని రూ. 39 వేల కోట్లకు కుదించిందని మండిపడ్డారు. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ.15 వేల కోట్ల నిధులు తగ్గాయని వాపోయారు.

"ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఉంటుంది. అత్యంత పటిష్ఠంగా ఉన్న తెలంగాణలో ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా కేంద్రం చేసింది. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తామంటేనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చింది. ఎన్ని కష్టాలనైనా భరిస్తాం కానీ.. రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోబోమని ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశాం. దీంతో సుమారు రూ. 6 వేల కోట్లను రాష్ట్రం కోల్పోయింది. మొత్తంగా రాష్ట్రానికి రావాల్సిన రూ. 21 వేల కోట్ల నిధులు ఆగిపోయాయి."- సీఎం కేసీఆర్‌

కక్షసాధింపు చర్యలు:ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నిధులను సమీకరించుకుంటుండగా కేంద్రం కక్షసాధింపు నిబంధనలతో వాటిని కూడా నిలిపివేయించింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వాధికారులు ఆయా సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. రుణాల రూపంలో వారిచ్చిన నిధులను తిరిగి చెల్లించేంత ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నామని, ఒప్పందాల ఉల్లంఘన సరికాదని వారికి నచ్చజెప్పారు. ఆ సంస్థలు రాష్ట్రం మీద నమ్మకంతో గత ఒప్పందాల మేరకు నిధులను ఈ మధ్యకాలంలో విడుదల చేస్తున్నాయి.

సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం తూట్లు:ఏటా ఆయా రాష్ట్రాలు అంచనాలకు అనుగుణంగానే ప్రగతి పద్దులు రూపొందించుకుంటాయని కేసీఆర్‌ తెలిపారు. కానీ కేంద్రం తన ఇష్టానుసారం అనుసరిస్తున్న అసమర్థ, అనుచిత నిర్ణయాల వల్ల సమయానుకూలంగా నిధులు అందక తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల ప్రగతి కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయన్నారు. కేంద్రం దిగజారుడు విధానాలతో రాష్ట్రాల గొంతును కోస్తూ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. ఈ విషయాలను రాష్ట్ర, దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందులో భాగంగా డిసెంబరులో శాసనసభ సమావేశాలు నిర్వహించి చర్చించాలని నిర్ణయించుకున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

"రాష్ట్రానికి రావాల్సిన రూ.20 వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా కేంద్రం నిలిపివేయించింది. కేంద్ర అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన నిర్ణయాలతో రాష్ట్రానికి దాదాపు రూ. 40 వేల కోట్లకు పైగా నిధులు రాలేదు."- సీఎం కేసీఆర్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details