CM Jagan Review on Animal Husbandary : పశు సంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి సచివాలయానికి ఒక విలేజ్ క్లినిక్స్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న సీఎం.. పశు సంవర్ధక శాఖలోనూ ఈ తరహాలోనే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. ఏకరూపత తీసుకురావడం ద్వారా మంచిసేవలు అందుబాటులో తీసుకురావొచ్చన్నారు. ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు – నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. దీనికి సంబంధించి ఒక హేతు బద్ధత ఉండాలన్నారు. దీనికోసం ఒక మార్గదర్శక ప్రణాళికను తయారుచేయాలని సీఎం ఆదేశించారు. పశువులకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ మేరకు వ్యాక్సిన్లు వేయాలన్నారు.
సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించుకోవాలి : ప్రజారోగ్యానికి సంబంధించి గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్ సహా ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలతో వ్యవస్థ సృష్టించామని, ఆర్బీకేల్లోనూ పశుసంవర్ధక విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. యానిమల్ హస్బెండరీ అసిస్టెంటు సమర్థతను పెంచాలనీ, గ్రామస్థాయిలో ఒకరిద్దరు వలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలన్న సీఎం.. దీనికోసం ఎస్‌ఓపీ తయారుచేయాలని చెప్పారు. . ప్రతి మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్ధ నుంచి ఆర్బీకేల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంటుకు పూర్తిస్థాయి మద్దతు, సహకారం ఉండాలన్నారు. పశుపోషణ చేస్తున్న వారి వద్ద కాల్‌సెంటర్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ నెంబర్లు అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్ కార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల పశువులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుందన్నారు.
రసాయనాలకు తావులేని పశుపోషణ:జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏర్పాటు చేసిన మిల్క్ సొసైటీల వద్ద అమూల్ భాగస్వామ్యంతో పాడిరైతులకు శిక్షణ ఇప్పించాలని సీఎం ఆదేశించారు. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని, పాల నాణ్యత పెరగాలని సీఎం సూచించారు. రసాయనాలకు తావులేని పశుపోషణ విధానాలపై అవగాహన పెంచాలన్నారు. పశుసంవర్థక శాఖలో అన్ని రకాల సేవలకోసం ఒకే నంబరు వినియోగించాలన్నారు. పశువుల అంబులెన్సులు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, దీనికోసం ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాలకోసం అవసరమైన రుణాలు మంజూరు చేయించడంలోనూ అధికారులు దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వచేయడానికి ప్రతి ఆర్బీకేలో ఫ్రిజ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పశు సంవర్థక శాఖలో 4,765 ఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.