'రాష్ట్రంలో 3 మేజర్ పోర్టుల నిర్మాణానికి యత్నం' - CM jagan said that efforts are being made to build 3 major ports in the state
పశు సంవర్థక, మత్స్య శాఖలో ఉన్న పలు సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. మచిలీపట్నంను మేజర్ పోర్టుగా తీర్చిదిద్దడం సహా, పలు చోట్ల జెట్టీల నిర్మాణం, ఆక్వా సాగు ప్రాంతాల్లో ల్యాబ్ల ఏర్పాటు, పశువులకు హెల్త్ కార్డులు వంటి వాటిపై జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పశువులకూ హెల్త్ కార్డులు
జనవరిని రిక్రూట్‌మెంట్ నెలగా చేసుకోవాలని.. ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోవాలని అధికారులను ఆదేశించారు. వెటర్నరీ ఆస్పత్రులు, క్లినిక్లలో సదుపాయాలను కల్పించాలన్నారు. పశువులకూ హెల్త్‌కార్డును ఇవ్వాలని దీనివల్ల క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. పశువుల మందులు కొనుగోలులో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీ కార్ల్‌ను లక్ష్యాలకు అనుగుణంగా నడపాలని సూచించారు. పులివెందులలో ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధి కోసం బ్రీడింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కరవు బాధిత ప్రాంతాల్లో పశువులకు ఆహార సమస్య లేకుండా చేయడానికి స్థిరమైన, శాశ్వతమైన విధానాలు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. పశువుల వైద్యం కోసం 102 వాహనాలు, వచ్చే ఏడాది నుంచి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.