అధికారులు, ప్రజాప్రతినిధులు క్రికెట్ జట్టులానే కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. క్రికెట్లో కెప్టెన్ మాత్రమే ఎప్పుడూ గెలవడని జట్టు సభ్యులంతా కలిసి ఆడితేనే గెలుపు సొంతమవుతుందని ఉదహరించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం పాలన ప్రారంభించి 20 నెలలు అవుతోందని.. అధికారులందరి సహకారంతోనూ అడుగులు ముందుకు వేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులతో సీఎస్ నిర్వహించిన సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి.. కీలకమైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజాధనం ఆదా చేసే ప్రయత్నం..
పాలన చేపట్టిన నాటి నుంచి విప్లవాత్మకమైన నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు సీఎం వివరించారు. దిశ చట్టం నుంచి గ్రామ వార్డు, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ.. ఈ జాబితాలో ఉన్నాయన్నారు. ఖర్చును తగ్గించుకునే ప్రయత్నాల్లో ప్రజాధనాన్ని ఆదా చేయగలిగామని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్ల లాంటి అంశాల లోతుల్లోకి వెళ్లి ప్రజాధనం ఆదా చేసే ప్రయత్నం చేశామన్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ ద్వారా టెండర్లలో అవినీతిని నియంత్రిస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు.
కీలక నిర్ణయాలతో ప్రజలకు చేరువ..
నగదు బదిలీ ప్రక్రియ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే రూ.90 వేల కోట్లను ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీ చేయగలిగామని సీఎం అన్నారు. దీంతో పాటు ఆంగ్లమాధ్యమం పాఠశాలలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లీనిక్స్, గ్రామ, వార్డు సచివాలయాలు, భూముల రీసర్వే లాంటి కీలకమైన నిర్ణయాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నట్టు సీఎం అధికారులతో వెల్లడించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలిచ్చామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాల్లో అధికార యంత్రాంగం కూడా మనసు పెట్టి పనిచేసిందని హర్షం వ్యక్తం చేశారు.