Videshi Vidya Deevena : విదేశీ విద్యా దీవెన పథకం కింద లబ్దిపొందిన విద్యార్థులు అభివృద్దిలోకి వచ్చి ప్రపంచ వేదికపై దేశం, రాష్ట్ర జెండా ఎగురవేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. పేద పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో పేరు, ప్రఖ్యాతులు పొందిన యూనివర్సిటీల్లో చదువుతోన్న విద్యార్థులకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
213 మంది విద్యార్ధులు.. రూ.19.95 కోట్లు : జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద మొదటి విడత సాయం నిధులు విడుదల చేశారు. ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్ధులకు రూ.19.95 కోట్లను విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నిధులను జమ చేశారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని సీఎం అన్నారు. పరిస్ధితులను మార్చాలనే చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన రాష్ట్రంలో విద్యా సంస్థలు అభివృద్ది చేస్తూ విద్య ప్రమాణాలను పెంచుతున్నామన్నారు.