ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ చర్యలతో చేనేత ఉత్పత్తుల ఆదాయం మూడింతలు పెరిగిందన్న సీఎం జగన్​

YSR NETANNA NESTAM లంచాలు, వివక్ష లేకుండా నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా చేశామని ముఖ్యమంత్రి జగన్​ తెలిపారు. వైఎస్సార్​ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.776 కోట్లు అందించామని.. ప్రతి నేతన్న కుటుంబానికి రూ.96 వేలు ఇచ్చామని వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు.

YSR NETANNA NESTAM
YSR NETANNA NESTAM

By

Published : Aug 25, 2022, 2:25 PM IST

Updated : Aug 26, 2022, 6:37 AM IST

ప్రభుత్వ చర్యలతో చేనేత ఉత్పత్తుల ఆదాయం మూడింతలు పెరిగిందన్న సీఎం జగన్​

CM JAGAN చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ వారికి ఇంత భారీగా ఆర్థిక సాయం అందించలేదని వెల్లడించారు. ‘వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా 80,546 మంది కుటుంబాలకు రూ.193.31 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈరోజు అందించే సాయంతో కలిపి ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వం రూ.776 కోట్లు ఈ పథకం కింద నేతన్నలకు అందించింది. పింఛన్ల కింద రూ.880 కోట్లు, ఆప్కో ద్వారా రూ.390 కోట్లు చెల్లించాం. ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేనేతల సంక్షేమానికి రూ.2,094 కోట్లు వెచ్చించింది. ఇదంతా పారదర్శకమే’నని సీఎం తెలిపారు. గురువారం కృష్ణా జిల్లా పెడనలో నాలుగో విడత నేతన్న నేస్తం కింద బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను సీఎం జమచేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు మెగాచెక్కును అందజేశారు. అనంతరం ‘గ్రామ దర్శిని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో గమనించిన నేతన్నల కష్టాలు తనను కదిలించాయని, వారికిచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక ఆసరాగా నిలిచానని వివరించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.24వేల చొప్పున తాజా సాయంతో కలిపి రూ.96 వేలు అందించామన్నారు.

మగ్గాల ఉన్నతీకరణతో కొత్త డిజైన్లు
ప్రభుత్వ సాయంతో నేత కార్మికులు తమ మగ్గాలను జాకార్డ్‌ లిఫ్టింగ్‌ యంత్రాలతో ఉన్నతీకరించుకోగలిగారని, సరికొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారని సీఎం జగన్‌ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో నేత కుటుంబానికి నెలకు కేవలం రూ.4,680 మాత్రమే ఆదాయం వచ్చేదని, ఉన్నతీకరణతో ఇది రూ.15వేలకు చేరిందని వివరించారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గిరాకీ లభించేలా ఈ-కామర్స్‌ దిగ్గజాలతో ఒప్పందం చేసుకోవడం కలిసి వచ్చిందని తెలిపారు. ఆప్కో ద్వారా వస్త్రాలను పూర్తిగా మార్కెటింగ్‌ చేసుకునే స్థాయికి చేరామని అన్నారు.

సామాజిక న్యాయం అంటే ఇదీ..
తమ హయాంలో బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ గుర్తు చేశారు. డీబీటీ ద్వారా మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను అర్హుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 75శాతం లబ్ధి కలిగిందని, ఇదీ సామాజిక న్యాయమని వివరించారు. కేబినెట్‌, స్థానిక సంస్థలు, నామినేటెడ్‌, రాజ్యసభ తదితర అన్ని పదవుల్లో ఈ వర్గాలకే పెద్దపీట వేశామని వివరించారు. కోట్ల మందికి మంచి చేయడానికి తనకు దేవుడు ఈ పదవినిచ్చారని, మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని కుట్రదారులు చాలామంది తయారయ్యారని సీఎం వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇచ్చిన సీఎం పదవిని కేవలం దత్తపుత్రుడు, కొందరి కోసం ఉపయోగించారని అన్నారు. ఆ రోజు ఉన్నది ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్‌.. ఇప్పుడు అప్పులూ తక్కువే.. కేవలం ప్రభుత్వ మార్పుతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టుకు న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందనే శుభవార్త తనకు ఇప్పుడే అందిందని చెప్పారు. జిల్లాలో తాను చేపట్టే తరువాతి కార్యక్రమం పోర్టుకు శంకుస్థాపనేనని, దీని కోసం త్వరలో మళ్లీ కృష్ణా జిల్లాకు వస్తానని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, జోగి రమేశ్‌, రోజా, ఎమ్మెల్యేలు పార్థసారథి, సింహాద్రి రమేష్‌, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్‌, కలెక్టర్‌ రంజిత్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

.

రెండు సార్లు జగన్‌కు మంత్రి జోగి పాదాభివందనం

.

ముఖ్యమంత్రి జగన్‌కు స్థానిక ఎమ్మెల్యే, గృహనిర్మాణ మంత్రి జోగి రమేష్‌ రెండుసార్లు పాదాభివందనం చేశారు. కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి వెలిగించాక సీఎం కాళ్లకు మంత్రి నమస్కరిస్తుండగా ఆయన వారించారు. సభలో తన ప్రసంగం పూర్తయ్యాక మంత్రి నేరుగా సీఎం వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 26, 2022, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details