ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం చేతుల మీదుగా వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన

కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. రూ.490 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కృష్ణా నదిలో పంపులు ఏర్పాటు చేసి 2.7 టీఎంసీల నీటిని ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోయనున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సీఎంకు కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఇది పూర్తైతే జిల్లాలోని పలు మండలాల రైతుల ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కల సాకారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

cm jagan laid foundation stone for vedadri lift irrigation project
వైఎస్​ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం

By

Published : Aug 28, 2020, 12:03 PM IST

Updated : Aug 28, 2020, 4:11 PM IST

వైఎస్​ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం

కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో సాగు, తాగు నీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జగ్గయ్యపేట మండలం వేదాద్రి క్షేత్రానికి సమీపంలోని కృష్ణా నది నుంచి ఎత్తిపోతల ద్వారా పలు ప్రాంతాలకు నీటిని తరలించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్‌ ద్వారా సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వేదాద్రి నుంచి మంత్రులు అనిల్‌ కుమార్‌యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతిసమీపంలోని, కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉందని సీఎం జగన్ అన్నారు. 5 ఏళ్లపాటు అధికారంలో ఉండికూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే, 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశామన్నారు. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వనుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తామని, డీబీఆర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ద్వారా నీరు అందిస్తామన్నారు. దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.

వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి నిలిచారని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత వాసులు ఎన్నో సంవత్సరాలుగా కన్న కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయని అన్నారు. నిర్ణీత సమయంలోనే వేదాద్రి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేసి నీరు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ఆర్థిక వనరుల సమీకరణకు ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు

Last Updated : Aug 28, 2020, 4:11 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details