అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా సీబీఐ నమోదు చేసిన పెన్నా సిమెంట్స్ కేసులో తాను నేరం చేసినట్లు ఏ ఒక్క ఆధారమూ లేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టుకు నివేదించారు. పెన్నా కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన మంగళవారం డిశ్ఛార్జి పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మీద కక్షతో తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి పిటిషన్ దాఖలు చేశారన్నారు. 94 మంది సాక్షుల నుంచి సీబీఐ వాంగ్మూలాలు సేకరించిందని, ఏ ఒక్కరూ తనపై ఆరోపణలు చేయలేదన్నారు. తాను ఏ ఒక్కరి నుంచీ లబ్ధి పొందినట్లు ఆధారాలు లేవని తెలిపారు. ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేసినట్లు కూడా ఆధారాలు లేవన్నారు. తాను ఎవరినీ మోసం చేయలేదని, ఐపీసీ సెక్షన్ 420 వర్తించదని చెప్పారు. పెన్నా సిమెంట్స్‌కు భూకేటాయింపులపై ఎమ్మార్వో నుంచి ప్రతిపాదనలు జిల్లా రెవెన్యూ అధికారికి, అక్కడి నుంచి ఆ ఫైలు సీసీఎల్‌ఏకు, ఎంపవర్డ్ కమిటీ ముందుకు... అనంతరం ముఖ్యకార్యదర్శి, మంత్రి తరువాత మంత్రిమండలి ముందుకు వెళ్లిందన్నారు. మంత్రిమండలి ఆమోదంతోనే భూకేటాయింపు జరిగిందన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయించాలని నాటి సీఎం రాజశేఖరరెడ్డి ఆదేశాలు జారీ చేశారనేందుకు ఆధారాలు లేవని తెలిపారు. అల్ట్రాటెక్‌కు లీజు రద్దుచేసి పెన్నాకు కేటాయించారన్న దానిలో వాస్తవం లేదని, ఆ కంపెనీ ప్రతినిధి పార్థసారథి మజుందార్ ఇచ్చిన ప్రకటనలో మైనింగ్ లీజును ఉపసంహరించుకున్నట్లు చెప్పారన్నారు. తాండూరు సిమెంట్స్‌కు కేటాయించిన లీజులు పెన్నా తాండూరుకు కేటాయించడంలోనూ నిబంధనలు పాటించినట్లు అధికారి వాంగ్మూలం ఇచ్చారన్నారు.