ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెప్పుకోవడానికి ఏమీలేక బూతులు మాట్లాడుతున్నారు: సీఎం - రైతలకు భూమి క్లియరెన్స్​ పత్రాలు జారీ చేసిన సీఎం

CM
పవన్​ కల్యాణ్​ వ్యాఖ్యలపై జగన్​ ఆగ్రహం

By

Published : Oct 20, 2022, 1:10 PM IST

Updated : Oct 20, 2022, 8:42 PM IST

12:50 October 20

ఇది మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధం: సీఎం

చెప్పుకోవడానికి ఏమీలేక బూతులు మాట్లాడుతున్నారు

CM Jagan Reacts on Pawan Kalyan Comments: జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ వ్యాఖ్యలపై సీఎం జగన్​ తీవ్రంగా మండిపడ్డారు. దారుణమైన బూతులు మాట్లాడే నాయకులు మనకు అవసరమా? అని ధ్వజమెత్తారు. చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వ్యవస్థను చూసి భయమేస్తోందని వ్యాఖ్యానించారు. చేసింది చెప్పుకోలేక బూతులు తిడుతున్నారని విమర్శించారు. ఇది మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధమని జగన్​ అన్నారు. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని.. నాయకులుగా చెప్పుకొంటున్న వాళ్లు ఇలా మాట్లాడితే మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మూడేసి, నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోమని చెబితే వ్యవస్థ ఏం బతుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం : కృష్ణా జిల్లా అవనిగడ్డలో సీఎం జగన్‌ పర్యటించారు. 22 ఏ(1) కింద ఉన్న నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపారు. రైతులకు నిషేధిత భూముల జాబితా నుంచి డీనోటిఫై భూముల క్లియరెన్స్‌ పత్రాలు జారీ చేశారు. అవనిగడ్డ-కోడూరు రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేస్తామని సీఎం జగన్​ స్పష్టం చేశారు. కృష్టా కుడి, ఎడమ కరకట్ట, సముద్ర కరకట్ట పటిష్ఠానికి రూ.25 కోట్లు కేటాయిస్తామన్నారు. అవనిగడ్డలో కంపోస్టు యార్డు తరలింపునకు నిధులు మంజూరు చేస్తామని, సీసీ డ్రైయిన్ల ఏర్పాటుకు కూడా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ, డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిధులు ఇస్తామన్నారు. రికార్డుల్లో వివరాలు పక్కాగా లేక ఇబ్బందిపడుతున్నారని సీఎం చెప్పారు. ఆధునిక సాంకేతికతతో భూముల రీసర్వే చేయిస్తున్నామని స్పష్టం చేశారు. కచ్చితమైన రికార్డులు ఉండాలని ఆలోచన చేశామన్నారు. రీసర్వే కోసం సర్వేయర్లను రిక్రూట్‌ చేశామన్నారు. హద్దులు సరిచేసి పత్రాలు జారీ చేస్తామన్నారు.

భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నామని సీఎం జగన్​ తెలిపారు. నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేస్తూ పత్రాల జారీ చేస్తామని చెప్పారు. రైతులకు యాజమాన్య హక్కు కల్పించే గొప్ప కార్యక్రమమని అన్నారు. సరిహద్దులు చూపడంతో పాటు హక్కు పత్రాలు జారీ అవుతాయన్నారు. భూములమ్మాలన్నా.. పిల్లలకు మార్చాలన్నా ఇబ్బంది ఉండదన్నారు. కోర్టులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. భూములపై హక్కు పత్రాలను కూడా రైతులకు అందజేస్తున్నామని సీఎం జగన్​ తెలిపారు.

మహిళలకు అస్వస్థత : సీఎం సభకు హాజరైన మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. సభలో పాల్గొన్న మోపిదేవి మండలం వెంకటాపురానికి చెందిన వేముల కోటేశ్వరమ్మ కాలికి తీవ్ర గాయమైంది. సభా ప్రాంగణంలోని ఓ గేటు కాలిపై పడటంతో ఆమె స్పృహ కోల్పోగా.. అంబులెన్స్‌లో విజయవాడకు తీసుకెళ్లారు. ఎండకు తాళలేక ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చాలామంది మహిళలు సభలో ఎండ వేడి భరించలేక సీఎం రాకముందే సభ నుంచి వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 20, 2022, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details