ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఖాయమని ధీమాగా ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని కేంద్రంలో మళ్లీ రాకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశానికి మద్దతుగా మమతాబెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ, కేజ్రీవాల్ లాంటి నేతలు చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఇదే రీతిలో చంద్రబాబు కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయనున్నారు. మొదటగా నేడు కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో ప్రచారానికి వెళ్లనున్నారు. రానున్న రోజుల్లో దిల్లీ, యూపీ, పశ్చిమ్‌బంగా, తమిళనాడు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. మే 8, 9 తేదీల్లో బంగాల్‌లో ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్‌లతో పాటు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్..... చంద్రబాబును ప్రచారానికి ఆహ్వానించారు.
విపక్ష కూటమి బలోపేతానికి చంద్రబాబు ప్రచార సాయం - non bjp
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తైనందున... ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. జాతీయస్థాయిలో విపక్ష కూటమి బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. నేడు కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి తరఫున ప్రచారం చేయనున్న చంద్రబాబు... రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల పర్యటనకు సిద్ధమవుతున్నారు.
ఓటమి భయంతోనే ఈసీపై చంద్రబాబు పోరాటం మొదలుపెట్టారన్న ప్రచారాన్ని తెలుగుదేశం కొట్టిపారేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేసిన కుట్రను ఎండగట్టకుంటే... కేంద్ర వ్యవస్థలను మోదీ మరింత నిర్వీర్యం చేస్తారన్నది తెలుగుదేశం నేతల వాదన. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఈసీపై పోరాటం తీవ్రం చేశారని స్పష్టంచేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిందని... అందుకే మధ్యాహ్నం వరకూ చాలాచోట్ల ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపిస్తున్నారు. ఆ రకంగా చాలామంది ఓటర్లు ఓట్లు వేయకుండా వెనక్కి వెళ్లేలా కుట్ర జరిగిందని అంటున్నారు. ఈ పరిస్థితిపై ఇప్పుడు పోరాడకుంటే ఆగడాలు మరింత పెరుగుతాయనే ఉద్దేశంతోనే... చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో మహిళలు, వృద్ధులు అధికంగా ఓటింగ్‌లో పాల్గొనడం వంటి పరిణామాలు తమ విజయాన్ని ఖరారు చేశాయంటున్నారు. చంద్రబాబు దిల్లీ పర్యటనపై ఎవరేమనుకున్నా... మే 23న వచ్చే ఫలితాలను ఎవరూ మార్చలేరని స్పష్టంచేస్తున్నారు. మోదీ ఓటమిని లక్ష్యంగా పెట్టుకున్నందునే... తొలుత ఈసీ, ఈవీఎంల తీరుపై చంద్రబాబు పోరు బాట పట్టారని చెబుతున్నారు.