SC Chief Justice NV Ramana Native Village Tour: ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లాలోని పొన్నవరానికి రానున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో మొదటిసారి తమ ఊరికి రానున్న ఆయనకు.. గ్రామస్థులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ఆ రోజు ఉదయం 9:30 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో కంచికచర్ల మీదుగా పేరకలపాడు క్రాస్‌రోడ్డు చేరుకుంటారు. అక్కడినుంచి భారీ ఊరేగింపుగా పొన్నవరం గ్రామానికి వస్తారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనను ఎద్దుల బండిపై ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం పౌర సన్మానం చేస్తారు. ఇందుకోసం గ్రామంలో భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఊళ్లోని శివాలయంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు చేయనున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణకు సోదరుడి వరసయ్యే నూతలపాటి వెంకట నారాయణ ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్య తిరిగి విజయవాడకు వెళ్తారు. చిన్నతనంలో ఆయనతో పాటు చదువుకున్న బాల్యమిత్రులు, గ్రామస్థులతో జస్టిస్ ఎన్వీ రమణ కొంతసేపు గడపనున్నారు. గ్రామంలో సీజేఐ పర్యటన సందర్భంగా నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు నాలుగైదు వేల మంది ప్రజలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.