వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాధిక కాకినాడకు చెందిన ఎస్‌బీసీ - కేటీసీ విద్యా సంస్థల అధినేత సోడదశి ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యలు, ఆయనపై సీఐడీ కేసు నమోదు, విచారణ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘దేవుళ్ల విగ్రహాలు ఫేక్... నేను ఎన్నో విగ్రహాలను నా చేతులతో ధ్వంసం చేశా.. పాస్టర్ ప్రవీణ్ ట్యాగ్’ పేరిట బెంగళూరు గో - సిప్స్ యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం అవుతున్న ఈ వీడియో ఆధారంగా ఈనెల 13న ఆయనపై సీఐడీ సైబర్ నేరాల విభాగం కేసు నమోదు చేసింది.
అనంతరం సీఐడీ ఎస్పీ రాధిక ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం కాకినాడ గ్రామీణ, సామర్లకోట మండలాల్లో విచారణ జరిపింది. తనిఖీల క్రమంలో ప్రవీణ్ చక్రవర్తి నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, వసతి గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. ఆయన నేరచరిత్రపై ఆరా తీశారు. ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలుస్తోంది.
మాటలే రూ.కోట్లు రాల్చాయ్
ఒడిశాకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి కుటుంబం కాకినాడలో ఏళ్ల క్రితం స్థిరపడింది. తండ్రి విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు. తల్లి విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారిణి. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చాక ఆర్థికంగా బలపడ్డారు. నిధులు సేకరించే క్రమంలో ఆయన చేసిన క్రైస్తవ గ్రామాలు, విగ్రహాల కూల్చివేత వ్యాఖ్యలపై ఆకర్షితులైన విదేశీయులు ఏటా రూ.కోట్లను సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన విలువైన వాహనాల్లో తిరుగుతూ.. విలాసవంత జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.
*ప్రవీణ్‌కు సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఎస్‌బీసీ-కేటీసీ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో ఆయన కుటుంబం నివాసం ఉంటుంది.
*కాకినాడ గ్రామీణంలో మదర్‌థెరీసా విద్యాసంస్థలు, కాకినాడలోని నాగమల్లితోట కూడలిలో ఓ హోటల్ ఉంది.
ఆది నుంచీ వివాదాస్పదమే...
ప్రవీణ్ చక్రవర్తి తీరు గతంలోనే వివాదాస్పదమైంది. గతంలో కాకినాడ రెండో పట్టణ పరిధిలో రెండు, కాకినాడ గ్రామీణ మండలం సర్పవరం ఠాణా పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి.
*ప్రవీణ్ 2015లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై జూన్‌లో ఐఫోన్6, బంగారం బహుమతిగా ఇచ్చి ప్రేమిస్తున్నానని చెప్పాడని పెదపూడి మండలానికి చెందిన యువతి 2016 ఫిబ్రవరిలో సర్పవరం ఠాణాలో ఫిర్యాదు చేశారు. ల్యాప్‌టాప్ బహుమతిగా ఇస్తానని కాకినాడలోని నాగమల్లితోట కూడలిలోని హోటల్‌కు పిలిపించి పెళ్లి చేసుకుంటానని, ఉంగరం తొడిగి అన్యాయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అదే నెల 10న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగా.. చదువు నిమిత్తం డబ్బులు కావాలంటూ తాను అతడికి ఉత్తరం రాసినట్లుగా హైకోర్టుకు చెప్పి మోసం చేశాడంటూ ఆమె ఇచ్చిన మరో ఫిర్యాదుపైనా కేసు నమోదైంది. కేసు వెనక్కి తీసుకోవాలని ప్రవీణ్‌చక్రవర్తి బెదిరించాడంటూ ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో రెండుసార్లు కేసు నమోదైంది. అనంతరం ఈ కేసులు కోర్టు కొట్టివేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
రెండో రోజు విచారించిన సీఐడీ
‘అనేక పల్లెలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానంటూ మీరు వ్యాఖ్యానించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్నాయి కదా? ఆయా గ్రామాలు ఎక్కడున్నాయి? ఎప్పుడు వాటిని మార్చారు? మీ ఉద్దేశంలో క్రైస్తవ గ్రామాలంటే ఏంటి? ఇందులో మీతోపాటు ఎవరెవరు పాల్గొన్నారు?’ అంటూ కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై సీఐడీ అధికారులు ప్రశ్నలను సంధించినట్లు తెలిసింది. ప్రస్తుతం వారి కస్టడీలో ఉన్న ఆయన్ను గురువారం రెండో రోజూ గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారించారు. ‘పలు విగ్రహాలను ధ్వంసం చేశానన్నారు కదా? ఏయే ఆలయాల్లో ధ్వంసం చేశారు?’ అని ప్రశ్నిస్తూ ప్రవీణ్ చక్రవర్తి నుంచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. గురువారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ప్రవీణ్ చక్రవర్తి తరఫు న్యాయవాది సమక్షంలో ఏకధాటిగా ఆయన్ని విచారించారు. మరోవైపు ప్రవీణ్ చక్రవర్తిని కలిసేందుకు ఆయన భార్య డాక్టర్ రేష్మ, ఇతర కుటుంబీకులు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే వారు కలిసేందుకు అధికారులు అనుమతించలేదు.
యూట్యూబ్‌కు లేఖ రాశాం: సీఐడీ సైబర్ నేరాల విభాగం ఎస్పీ రాధిక
ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యానించినట్లున్న వీడియోలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం యూట్యూబ్ అధికారులకు లేఖ రాశామని సీఐడీ సైబర్ నేరాల విభాగం ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కాకినాడలోని ప్రవీణ్ చక్రవర్తి ఇల్లు, అనాథాశ్రమంలో సోదాలు చేసి పలు ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొన్ని ఆధారాలు ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించామని తెలిపారు. ‘ప్రవీణ్ కోసం జనవరి 18న కస్టడీ పిటిషన్ వేశాం. 19న కస్టడీకి అనుమతి లభించింది. దర్యాప్తు సక్రమంగా సాగుతోంది’ అని తెలిపారు.
ఇదీ చదవండి:
సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్