విద్యార్ధుల సంక్షేమ వసతి గృహాలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పరిమితికి మించి హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన... వార్డెన్‌లకు ప్రహసనంగా మారింది. విజయవాడ గుణదలలోని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహం, బాలికల సాంఘిక సంక్షేమ గృహాల్లో …బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. బాలుర వసతి గృహంలో మూడో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న భవనం 120 మంది విద్యార్ధులకు మాత్రమే సరిపోతుంది. కానీ అందులో 190 మంది ఉంటున్నారు. బాత్రూంలు సరిపడినన్ని లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు గుర్తించారు.
బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో తనిఖీలు నిర్వహించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులకు సమస్యలు స్వాగతం పలికాయి. 60 మంది విద్యార్థులు ఉంటున్న హాస్టల్లో సిక్ రూం లేదని అధికారులు గుర్తించారు. అనారోగ్యం బారిన పడితే ప్రత్యేక గదిలో ఉండేందుకు అవకాశం లేదని కమిషన్ ఎదుట విద్యార్థులు వాపోయారు. హాస్టల్‌కు వాచ్‌మెన్ లేరని అధికారుల తనిఖీలో వెల్లడైంది. వసతి గృహాల్లో గుర్తించిన లోపాలను.. ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు వెల్లడించారు.