పెద్ద వాళ్లే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే వందసార్లు ఆలోచిస్తారు.. ఇక పిల్లలు అయితే ఆపేరు చెబితేనే వణికిపోతారు. పిల్లల్లో ఈ భయాన్ని పోగొట్టేందుకు కృష్ణా జిల్లా పోలీసులు ఛైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తున్నారు. శిశు సంక్షేమ అధికారుల సూచనలతో డివిజన్కొక పీఎస్‌లో చిన్నారుల సమస్యలు వినేందుకు.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవంబర్ 19న రెండు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో ఈ తరహా పీఎస్‌లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మచిలీపట్నం, గుడివాడల్లో ముందుగా వీటిని ప్రారంభించనున్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్..
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో 14 వేల మంది బాల కార్మికులు, వీధి బాలలను పోలీసులు రక్షించారు. దీంతో పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకించి పిల్లల కోసం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచనల మేరకు కృష్ణా జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్ల రూపురేఖలు మారుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కో పోలీస్ డివిజిన్లో ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.