CM review on construction of houses : రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పట్టాల పంపిణీ అనంతరం వేగంగా ఇళ్ల నిర్మాణం సాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సీఎం నిర్దేశించారు. గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని అమరావతి లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం చర్చించారు. సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సాధ్యమైనంత త్వరగా నిర్మించాలి... ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేదలకు ఎంత త్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయని సీఎం జగన్ తెలిపారు. సీఆర్డీఏ ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్న అధికారులు.. ల్యాండ్ లెవలింగ్ పనులు చేశామన్నారు. సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. 5024 టిడ్కో ఇళ్లను అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
3.70లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి..రాష్ట్రంలో గృహ నిర్మాణం పైనా సీఎం ఆరా తీశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. గడిచిన 45 రోజుల్లో హౌసింగ్ కోసం 1085 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. 5.01లక్షల ఇళ్లు రూఫ్ లెవల్, ఆపై నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించిన అధికారులు... మరో 45 రోజుల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బేస్‌మెంట్ లెవల్ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షల పైనే ఉన్నాయని, వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు వివరించారు. జగనన్నకు చెబుదాం స్పెషల్ ఆఫీసర్లు సైతం జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో వాడే మెటీరియల్ నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 11.03 లక్షల మందికి 35 వేల చొప్పున.. 3886.76 కోట్ల మేర పావలా వడ్డీకే రుణాలు అందించామని వెల్లడించారు.
పనులు వేగవంతం: ఆర్-5 జోన్‌లో సీఆర్డీఏ యుద్ధప్రాతిపదికన లేఅవుట్ అభివృద్ధి పనులు చేస్తోంది. ఆర్-5 జోన్‌లో 51,392 మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. అర్హులకు నెక్కల్లు, నవులూరు, కృష్ణాయపాలెం, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, అనంతవరంలో ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. 1,402 ఎకరాల్లో 25 లేఅవుట్లను సీఆర్డీఏ యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది. లేఅవుట్లలో రోడ్లు, లెవలింగ్, గ్రావెలింగ్ పనులు, హద్దురాళ్లను వేస్తున్నారు. ఈ పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు.
ఇవీ చదవండి :