CM Review : ఆదాయార్జనలో మెరుగైన విధానాలు, చక్కని పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అధ్యయనంలో తేలిన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని ఆదేశించారు. నిర్ణయించిన లక్ష్యాల మేరకు ఆదాయాన్ని తీసుకురావాలని అధికారులను నిర్దేశించారు. వివిధ శాఖలు వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని సమీక్షించిన సీఎం.. పలు కీలక ఆదేశాలిచ్చారు. ఆదాయార్జనలో నిర్ణయించిన లక్ష్యానికి చేరువగా ఉన్నట్లు సీఎంకు తెలిపిన అధికారులు... పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామన్నారు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు.
ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఎక్సైజ్, రెవెన్యూ శాఖల మంత్రులు కె.నారాయణ స్వామి, ధర్మాన ప్రసాదరావు, సీఎస్ డాక్టర్ కెఎస్. జవహర్‌రెడ్డి సహా అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గనులు భూగర్భశాఖ, హోంశాఖ, రవాణాశాఖ, వాణిజ్య పన్నుల శాఖ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు శాఖల నుంచి వస్తోన్న ఆదాయంపై సీఎం చర్చించారు. లక్ష్యాలను ఏ మేరకు చేరువయ్యారనే విషయం పైనా చర్చించారు.
జీఎస్టీ వసూళ్లలో ముందంజ.. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయని వివరించారు. డిసెంబర్ 2022 వరకూ జీఎస్టీ గ్రాస్ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతంగా ఉండగా... రాష్ట్రంలో వసూళ్లు 26.2 శాతం ఉందన్నారు. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాష్ట్రాల కన్నా మెరుగైన వసూళ్లు రాష్ట్రంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 2022 జనవరి నాటికి జీఎస్టీ వసూళ్లు రూ.26,360.28కోట్లు ఉంటే, ఈ ఏడాది జనవరి నాటికి రూ.28,181.86 కోట్లు వచ్చాయని తెలిపారు. గతేడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు వివరించారు. జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆదాయాలను కలిపితే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ.46,231 కోట్లు కాగా, రూ.43,206.03 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. దాదాపు 94 శాతం లక్ష్యాన్ని సాధించామని సీఎంకు తెలిపారు.