ఇంట్లోనే కరోనా పరీక్షలు...
కరోనా మహమ్మారి ఇప్పటికే లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. మన దేశంలోనూ కరోనా వైరస్ ప్రభావం....ఎక్కువగానే ఉంది. అయితే కరోనా వైరస్ గుర్తింపులో అతి ముఖ్యమైన ప్రక్రియ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం. ఓ వైపు అనుమానితులకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరీక్షలు జరుపుతున్నా....ఇంకా కొంత మంది పరీక్షలు చేయించుకునేందుకు వెనకడుగువేస్తున్నారు. పరీక్షలు చేయిస్తే ఎలాంటి ఫలితం వస్తుందే....ఆస్పత్రులకు వెళ్లి చేయించుకోవాల్సి ఉంటుందేమోననే అనుమానాలతో పరీక్షలకు ముందుకు రావడం లేదు. అలాంటి వారి కోసం కృష్ణాజిల్లాలోని నున్న గ్రామానికి చెందిన సాయికృష్ణ ఓ వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను రూపొందించాడు. WWW.CHECKCOVIDNOW.COM(చెక్ కొవిడ్ నౌ) అనే అప్లికేషన్ ను....స్నేహితులు అన్నమయ్య, విజయ్‌తో కలిసి అందుబాటులోకి తీసుకొచ్చాడు.
జీపీఆర్ఎస్ మొబైల్ ఫోన్లలోనూ పని చేస్తుంది..
ఆస్పత్రులకు వెళ్లేందుకు సంశయించే వారు, తమకు కరోనా సోకిందా.. లేదా ..అనే అనుమానం ఉన్న ఎవరైనా.....ఈ అప్లికేషన్ ను ఓపెన్ చేసి...చాలా సులభంగా కొవిడ్ పరీక్ష చేయించుకోవచ్చు. కేవలం 30 సెకన్లలో తమకు కరోనా ఉందా లేదా అనే విషయాన్ని శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోవచ్చు. అన్ని రకాల చరవాణుల్లోనూ ఇది ఓపెన్ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఉండాల్సిన పనిలేదు. జీపీఆర్ఎస్ మొబైల్ ఫోన్లలోనూ తేలిగ్గా పనిచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), ఐసీఎమ్ఆర్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన 11 సులభ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా మనకు కరోనా సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చు.
వ్యాధి లక్షణాలు త్వరగా తెలుసుకోవచ్చు..
వ్యక్తులు ఇచ్చే సమాధానాలకు బట్టి.....వారికున్న లక్షణాల ఆధారంగా హై, మీడియం, లో....అని మూడు భాగాలుగా విభజిస్తారు. వీటిలో ఎవరికైనా 'హై' అని తేలితే వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత డీఎంహెచ్ వో లేదా ప్రభుత్వ వైద్య అధికారులకు సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా అందిస్తారు. ఫలితంగా ఫలానా ప్రాంతంలో కోరనా కేసు నమోదైందన్న విషయం వైద్య అధికారులకు తెలియడం ద్వారా వారిని అప్రమత్తం చేసేందుకు కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని సాయికృష్ణ చెబుతున్నాడు