ఇసుక కొరతపై 12 గంటల దీక్షకు కూర్చున్న తెదేపా అధినేత బెజవాడ అలంకార్ సెంటర్ వద్ద ధర్నాచౌక్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిరసన దీక్ష చేపడుతున్నారు. తొలుత బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి.. మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలకు చంద్రబాబు పూలమాల వేశారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు నివాళులర్పించారు. మెడలో నూలు దండ వేసుకుని తెదేపా అధినేత దీక్షకు కూర్చున్నారు. ఇసుక సమస్యపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దీక్ష కొనసాగనుంది. తెదేపా నేతలు, కార్యకర్తలు, ప్రజా, కార్మిక సంఘాలు ధర్నాచౌక్‌కు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
అన్నిపక్షాల మద్దతు
చంద్రబాబు తలపెట్టిన దీక్షకు అన్ని పక్షాలూ పూర్తి మద్దతు తెలపటం సహా ఏడు డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను తెదేపా నేతలు స్వయంగా కలిసి దీక్షకు మద్దతు కోరారు. భాజపా సంఘీభావం తెలపగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ను తమ ప్రతినిధులుగా దీక్షకు పంపిస్తామని జనసేన తెలిపింది.
సర్కార్ ముందు మూడు డిమాండ్లు
నిరసన దీక్ష కోసం తెదేపా శ్రేణులు అన్ని ఏర్పాట్లూ చేశాయి. దీక్షకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబీకులు సైతం దీక్షలో పాల్గొంటారు. "కావాలి ఉచిత ఇసుక... పోవాలి ఇసుక మాఫియా" నినాదంతో తలపెట్టే చంద్రబాబు దీక్షకు అన్ని వర్గాల మద్దతు కూడగట్టేలా ప్రచారగీతాలను తెదేపా నేతలు సిద్ధం చేశారు. పనుల్లేక చనిపోయిన కుటుంబీకులకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం, ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేలు చొప్పున భృతి అందించాలనే డిమాండ్లను తెలుగుదేశం.. సర్కారు ముందు పెట్టింది.