దుర్ఘటన జరిగాక బాధితులకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ట్విట్టర్‌లో తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. లాలూచీ రాజకీయాలు చేసుకుంటూ పోతే ప్రజలు ఇలాగే రోడ్లెక్కుతారని ఆయన మండిపడ్డారు. వెంకటాపురం గ్రామస్థులు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో 5 కి.మీ. పరిధిలోని ప్రజలంతా నరకం చూశారని అన్నారు. వెంకటాపురం గ్రామంలో మరింత ఎక్కువగా ప్రాణనష్టం జరిగిందన్నారు. గ్రామస్థులకు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. వెంకటాపురం గ్రామస్థులు కోరినట్లుగా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని... గ్రామంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరకులు సంస్థతో ఇప్పించాలన్నారు.