చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని, ఆయనకు పటిష్ఠ భద్రతను కల్పిస్తున్నామని డీజీపీ కార్యాలయం తాజాగా ప్రకటన విడుదల చేసింది. విజయవాడలో 135 మంది, హైదరాబాద్లో 48 మంది కలిపి మొత్తం 183 మందితో ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొంది. అయితే డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న సమాచారం అవాస్తవమని తెదేపా ఆరోపిస్తోంది. ఈ నెల 12న చంద్రబాబు పీఎస్ కృష్ణ కపర్దికి , నిఘా విభాగం ఐజీ రాసిన లేఖే అందుకు ఆధారమంటూ దాన్ని మీడియాకు విడుదల చేసింది .
" జనవరి 1 , 30వ తేదీల్లో నిర్వహించిన భద్రతా సమీక్ష కమిటీ సమావేశంలో జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ప్రకారం చంద్రబాబుకు మొత్తం 67 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నాం " అంటూ నిఘా విభాగం ఐజీ లేఖలో పేర్కొన్నారని తెదేపా వివరించింది. నిఘా విభాగం ఐజీయే 67 మందితో భద్రత కల్పిస్తున్నామని లేఖ రాస్తే . . 183 మందితో రక్షణ ఇస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తప్పుడు సమాచారంతో ఎలా ప్రకటన విడుదల చేస్తుందని తెదేపా ప్రశ్నిస్తోంది. చంద్రబాబు భద్రత వ్యవహారంలో డీజీపీ కార్యాలయం, నిఘా విభాగం ఐజీల మధ్య సమన్వయ లోపం ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు ఇదే తార్కాణమని పేర్కొంది.