Chandrababu fire on Jagan : యుగానికో రాక్షసుడు పుడతాడు.. జగన్ అలాగే పుట్టాడంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లి అంటే ప్రేమ లేదు.. చెల్లి అంటే ప్రేమ లేదని ఆయన విమర్శించారు. ఓ బాబాయిని చంపించాడు.. మరో బాబాయిని జైలుకు పంపాడన్నారు. ఏమన్నా అంటే బటన్ నొక్కానంటున్నారన్న చంద్రబాబు... ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా నొక్కారా అని నిలదీశారు. జగన్ ఇక్కడితో ఆగడు.. తన ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుని.. మన మీదే ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తారని వ్యాఖ్యానించారు. జగన్ దళిత ద్రోహి అని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎస్సీ నేతలదేనన్నారు. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపుల మీద కాదు.. పోలీస్ స్టేషన్‌లోనన్నారు. లోకేశ్ జగన్‌ను తిడితే.. ఎస్సీలను తిట్టినట్టుగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దళిత ద్రోహి జగన్ అనే విషయాన్ని బలంగా చెప్పాలని చంద్రబాబు సూచించారు.
దళిత సంఘాలతో ఆత్మీయ సమావేశం.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దళిత సంఘాల నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దళిత సంక్షేమంపై మేనిఫెస్టోలో రూపొందించాల్సిన అంశాలపై చర్చించారు. ఏపీలోని ప్రతి దళిత గడపకు తేదీలో చేరేలా తెలుగుదేశం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. దళిత నేతలు.. పార్టీ ఎస్సీ సెల్ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టే యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీలకు తెలుగుదేశం చేసినన్ని మంచి పనులు ఇంకెవరూ చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీ సంక్షేమం కోసం మనం చేసిన పనులను చెప్పుకోవడంలో విఫలం అయ్యామని, సమావేశం పెట్టుకున్నాం.. అంతా మాట్లాడేసుకున్నామంటే కుదరదని అన్నారు.
జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటుతో..అంబేడ్కర్ రాజ్యాంగం రాసినా.. దాన్ని అమలు చేయని పరిస్థితి ఉంటే.. తాను జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశామన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేసి అంటరానితనాన్ని రూపుమాపామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్‌ను నిర్వీర్వం చేసిందన్నారు. ఎస్సీ కార్పోరేషన్ల ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎస్సీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక్క పథకమైనా అమలు చేస్తోందా అని చంద్రబాబు నిలదీశారు.