కరోనా సమయంలోనూ.. ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతుండటం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని ఇచ్చారు. కరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్న చంద్రబాబు.. ప్రజలకు జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సరిగా వ్యవహరించని ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తత చేయడం ప్రతిపక్షంగా తమ బాధ్యతని స్పష్టం చేశారు. కరోనా తీవ్రతపై ఎన్నిసార్లు చెప్పినా.. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం బాధేస్తోందన్నారు. ప్రతిపక్షం నేతల సలహాలు, సూచనలు పెడచెవిన పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.
బంధువులు, కుటుంబ సభ్యులను చూసుకోలేని విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరు మనోధైర్యంగా ఉండాలని సూచించారు. వర్చువల్ గా పనిని అలవాటు చేసుకుంటూ.. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలని కోరారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లు ఎంతో సేవ చేస్తున్నారన్నారు. ప్రాణాలు కాపాడేందుకు వారు చేసే అత్యవసర సేవ వెలకట్టలేనిదని అభినందించారు. ఫ్రంట్ లైన్ వారియర్లు కొంతమంది చనిపోవడం బాధాకరమని, వారంతా కనిపించే దేవుళ్ళని అభివర్ణించారు. కనిపించని శత్రువు కరోనాపై పోరాడే వారందరికీ అభినందనలు తెలిపారు. జాతి వారి సేవలకు రుణపడి ఉంటుందన్నారు.