రాజధాని నివేదికలు అసత్యాల పుట్ట : చంద్రబాబు పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేస్తే.. రాయలసీమ జిల్లాల్లోని నగరాలు, పట్టణాలకు విశాఖ కంటే ఇతర రాష్ట్రాల రాజధానులు దగ్గరవుతాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. హిందూపురం నుంచి విశాఖకు 915 కిలోమీటర్ల దూరం ఉంటే బెంగుళూరు కేవలం 110 కిలోమీటర్లు మాత్రమేనని.... చెన్నై, హైదరాబాద్, పనాజీ, తిరువనంతపురం కూడా విశాఖ కంటే తక్కువ దూరంలోనే ఉన్నాయని వెల్లడించారు. కర్నూలు నుంచి విశాఖకు 690 కిలోమీటర్ల దూరం ఉంటే బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు దగ్గరగా ఉన్నాయన్నారు. చిత్తూరుకు విశాఖ 830 కిలోమీటర్ల దూరంలో ఉండగా, కుప్పంకి 950 కిలోమీటర్లు, కడపకు 730 కిలోమీటర్లు, పులివెందులకు 795 కిలోమీటర్ల దూరంలో విశాఖ ఉందన్నారు. అభివృద్ది చెందిన సైబరాబాద్, నవీ ముంబైతో గ్రీన్‌ఫీల్డ్ నగరం అమరావతిని పోల్చకుండా విఫలమైన నగరాలు అంటూ అసత్య ప్రచారం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు.
మనతో పోలీకేంటీ ?
ఇప్పటికే రాజధానులున్న దేశాలకు, రాజధాని లేని మన రాష్ట్రానికి పోలికేంటని చంద్రబాబు నిలదీశారు. రెండో ప్రపంచయుద్ధం కాలం నాటి రాజధానుల ప్రస్తావన ఇప్పుడెందుకన్నారు. అమరావతి కన్నా గొప్ప ప్రదేశం రాజధానిగా ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.
అనుమానాలు అనవసరం
అమరావతి అభివృద్ధిపై బీసీజీ అనుమానాలు వ్యక్తం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా ప్రకటించగానే ఎన్నో విద్యా సంస్థలు, ఆస్పత్రులు, హోటళ్లు ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారని గుర్తుచేశారు. అవన్నీ మనుగడలోకి వస్తే అమరావతి అభివృద్ధి మరో దశకు వెళ్తుందని వ్యాఖ్యానించారు.
నివేదిక అసత్యమయం
పెరిగే జనాభా అవసరాలకు తగ్గట్లుగా పెద్దపెద్ద నగరాల శివార్లలో అభివృద్ధి చేసిన హబ్‌లు, అర్బన్ టౌన్ షిప్‌లను హరిత నగరాలుగా చూపించి అవన్నీ విఫలమయ్యాయని చెప్పడం బట్టే బీసీజీ నివేదిక చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలమయంగా ఉన్నటువంటి నివేదికకు విలువే లేదన్నారు.
ఇదీ చదవండి :
'చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం'