మంత్రి పేర్ని నానిపై దాడి కేసును ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి కొల్లు రవీంద్రపై కక్ష సాధింపు చర్యలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విచారణల పేరుతో ఆయనను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. మంత్రిపై దాడి ఘటనను తెదేపా తీవ్రంగా ఖండించిందని తెలిపారు. తెదేపా వారే చేయించారంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. పేర్ని నానిపై దాడికి, తెదేపాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఏం జరిగినా తెలుగుదేశం పార్టీ నాయకులకే ముడిపెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలపై ఇంత కక్ష సాధింపులు ఎందుకని నిలదీశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని విచారిస్తే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు. గతంలో కుటుంబ కలహాలతో జరిగిన హత్యలో కొల్లు రవీంద్రను అరెస్టు చేశారన్న చంద్రబాబు.. అక్రమ కేసులు పెట్టి అణగదొక్కాలనుకోవడం సరికాదని హితవు పలికారు. వైకాపా దిగజారుడు రాజకీయాలకు ప్రయత్నిస్తోందని, మితిమీరి వ్యవహరిస్తే తగిన శాస్తి చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.