కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన తెదేపా ప్రతినిధి బృందంపై వైకాపా దాడి గర్హనీయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా దోపిడీని బయటపెట్టారనే అక్కసుతోనే దాడికి తెగించారని విమర్శించారు. కొండపల్లి బొమ్మల ఖ్యాతిని ప్రధాని మోదీ కొనియాడారని.. ఆ బొమ్మల తయారీకి వాడే చెట్లను వైకాపా నరికేస్తోందని దుయ్యబట్టారు.
అడవులు నరికేస్తూ, కొండలు కొట్టేస్తూ, గుట్టలు తవ్వేస్తూ... మట్టి, ఇసుక, కంకర స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా నాయకులు పంచభూతాలను మింగేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ, బందరు వద్ద మడ అడవులను వైకాపా నాయకులు నరికేశారని.. స్థానిక ప్రజలే వైకాపా అరాచకాలను బయటపెట్టారని గుర్తు చేశారు. మడ అడవుల పరిరక్షణకు సామాజిక ఉద్యమం ప్రారంభించారని తెలిపారు. అక్రమ మైనింగ్ చేసేవారిని, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సహజ వనరులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.