జేసీ ప్రభాకర్‌రెడ్డి వద్ద లారీలు కొన్నామని చెప్పమంటూ లారీ యజమానులను వైకాపా ఎంపీ ఎగదోశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని అన్నారు.
'తెదేపా నేతలపై పెట్టేవి అక్రమ కేసులే... ఇదిగో సాక్ష్యం' - వైకాపా ఎంపీ వీడియోను చంద్రబాబు విడుదల
వైకాపా నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లారీ యజమానులతో వైకాపా ఎంపీ సంభాషణకు సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.
విలేకరుల సమావేశంలోనే ఇంత కుట్ర చేసిన వాళ్లు, తెరవెనుక ఇంకెన్ని చేస్తున్నారో ప్రజలే ఆలోచించాలని చంద్రబాబు కోరారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని ధ్వజమెత్తారు. ప్రజలిచ్చిన అధికారాన్ని సొంత కక్ష సాధింపులకు వాడుకోవడం నేరమని హితవు పలికారు. అయ్యన్నపై కేసు వైకాపా కక్ష సాధింపునకు మరో రుజువు అని దుయ్యబట్టారు. బీసీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు వైకాపా కుట్ర పన్నిందని ఆరోపించారు. జగన్‌కు మొదట్నుంచీ బీసీలంటే కక్ష అన్న చంద్రబాబు... బీసీలు తెదేపాకు వెన్నెముకగా ఉన్నందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ బరితెగింపునకు ప్రజలే సరైన సమాధానం చెబుతారని.. సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు.