రాజధానిగా అమరావతి తరలిపోకుండా ఏమి చేయాలో అన్ని చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థం అయ్యే విధంగా తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల ఇంచార్జిలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పెట్రోల్, డీజిల్ అమాంతం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెప్పిందేంటి.. చేస్తోందేంటి..?
సీఎం అసమర్ధత వల్లే కరోనా రోజురోజుకు పెరుగుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇంతవరకు సీఎం మాస్క్ ధరించకుండా.. అందరూ మాస్క్ ధరించకపోతే జరిమానాలు వేస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు ప్రభుత్వం చెప్పిన మెనూ ఏంటి..? ఇప్పుడు ఇస్తోందేంటని ప్రశ్నించారు.
ఉడికీ ఉడకని అన్నం, మాడిపోయిన చపాతీ, ఎండిపోయిన ఇడ్లీ, నీళ్ల సాంబారు, కంపుగొట్టే కూరలు రోగులకు ఇస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. డిశ్చార్జ్ అయిన రోగులకు రూ.2 వేలు ఇస్తామని చెప్పి రూ.50, రూ.100 చేతిలో పెట్టి పంపిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని నిలదీశారు.
ఏడాదిలో లక్ష కోట్ల అప్పులు
వైకాపా ఏడాదిలోనే 34 పథకాలు రద్దు చేసి.. లక్ష కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పటికే జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 34.6 శాతానికి పెరిగిందన్న ఆయన.. రాబోయే నాలుగేళ్లలో ఎంత అప్పు చేస్తారో అని ఆందోళన కలుగుతుందన్నారు. వైకాపా అమరావతిని చంపేసి.. పారిశ్రామిక వేత్తలను బెదిరించి యువత ఉపాధి అవకాశాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇసుక కొరత సృష్టించి.. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోగొట్టారని ఆక్షేపించారు.