ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీపీఎం ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమం... చివరి రోజు భారీ ర్యాలీలు - anantapur

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 7 నుంచి 15 వరకు సీపీఎం నాయకులు ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ ముగింపు సందర్భంగా భారీ ర్యాలీలు చేపట్టారు. కృష్ణా జిల్లా విజయవాడ, మైలవరం, నందిగామలతో పాటు అనంతపురం, శ్రీకాకుళంలోనూ నేతలు భారీసంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర విధానాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని అన్నారు. నియోజకవర్గల పరిధిల్లోని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

Central policies hinder state development:cpm
సీపీఎం ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమం

By

Published : Nov 15, 2020, 3:19 PM IST

Updated : Nov 15, 2020, 6:10 PM IST

22 మంది ఎంపీలను గెలిపించినా ప్రత్యేక హోదా, విభజన హామీలను సీఎం జగన్ పక్కన పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు అన్నారు. ప్రజాచైతన్య ప్రచార కార్యక్రమం ముగింపు సభను విజయవాడ ధర్నా చౌక్​ వద్ద నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు చేసిన సహాయం కంటే వారిపై మోపిన భారాలే ఎక్కువని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాజీపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో మూడుముక్కలాట ఆడుతున్నారని, ఏపీ రాజధానిగా అమరావతికే మా మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. నూతన ఇసుక పాలసీ పేరుతో భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇస్తామన్న 30 లక్షల గృహాల హామీ ఇంకెప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు.

మైలవరంలో...

కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మైలవరం నాలుగు రోడ్ల కూడలిలో సీపీఎం నేతలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి నిలిచిపోవడానికి కేంద్ర వైఖరే కారణమని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆంజనేయులు ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలను తీర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటీయూ మండల కార్యవర్గ సభ్యులు చాట్ల సుధాకర్ విమర్శించారు. ఇళ్లస్థలాల పంపిణీలో జాప్యం తగదని, ప్రజలతో కలిసి పోరాటం చేయడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

నందిగామలో...

రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సీపీఎం నేతలు చేపట్టిన ప్రజా చైతన్య కార్యక్రమం ముగింపు సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఎస్​ఎన్​ఎల్, బ్యాంకింగ్, ఎల్ఐసీ, రైల్వే లాంటి సంస్థలు ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని తెలిపారు. ఆ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.

అనంతపురంలో...

అనంతపురంలో సీపీఎం నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రజాచైతన్య ప్రచార కార్యక్రమం ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళంలో...

రాజ్యాంగాన్ని కాలరాస్తున్న భాజపా ప్రభుత్వ విధానాలతో వైకాపా, తెదేపాలు రాజీపడి లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు గోవిందరావు అన్నారు. ఏడు రోడ్ల కూడలిలో బహిరంగ సభను నిర్వహించారు. విభజన హామీలను కేంద్రం నేటికీ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ పాఠశాలలను వణికిస్తున్న కరోనా

Last Updated : Nov 15, 2020, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details