kishan reddy on buying a trs mlas issue తెలంగాణ మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని గ్రహించే తెరాస కొత్త నాటకానికి తెరతీసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన నేపథ్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. తెరాస ఎమ్మెల్యేలకు రూ.వందల కోట్లు ఇవ్వడానికి భాజపా కుట్ర చేసిందంటూ ఆరోపణలు చేశారని.. డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపించిందంటూ ప్రజల ముందు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని దిష్టిబొమ్మలను సైతం మంత్రులే తగులబెట్టారని మండిపడ్డారు.
‘‘తెరాస రూ.వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారని సర్వేలు తేల్చిచెప్పాయి. దొరికిందని చెబుతున్న డబ్బు ఎంత?ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలను ఎందుకు బయట పెట్టడం లేదు? దొరికిన డబ్బు ఎమ్మెల్యేల నుంచి వచ్చిందా? లేక కేసీఆర్ ఫాంహౌస్ నుంచి వచ్చిందా? పార్టీ ఫిరాయించిన వారికి పెద్దపీట వేసింది తెరాస అనే విషయాన్ని గ్రహించాలి. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకున్నది తెరాస కాదా? చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇచ్చింది నిజం కాదా? ఇంద్రకరణ్ రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచారు? పార్టీ ఫిరాయింపులకు పెద్ద పీట వేసేది కేసీఆరే. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన పార్టీలోకి చేర్చుకున్నారు? తెరాసకు ఓటమి భయం పట్టుకుంది. మునుగోడులో ఓటమి తెరాసకు కళ్ల ముందు కనిపించింది. ఆ ఓటమి అర్థమయ్యే కొత్త నాటకానికి తెరలేపారు.'' - కిషన్‌రెడ్డి
సీఎం పదవి ఊడుతుందని కేసీఆర్‌కు భయం పట్టుకుంది. తెరాస నీతి మాటలు చెప్పడం హాస్యా్స్పదంగా ఉంది. మంత్రి హత్యాయత్నం వ్యవహారంలో కూడా భాజపాపై ఆరోపణలు చేశారు. మునుగోడు నాయకులకు ఫోన్ చేసి తెరాసలో చేరమని కేటీఆర్ ఫోన్ చేయలేదా? దుబ్బాకలో కూడా ఇలాంటి నాటకాలే ఆడారు. మునుగోడులోనూ అలాంటి సీన్ పునరావృతం అయింది. పోలీసు అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు వేలాది మంది భాజపా కార్యకర్తలకు తాయిలాల ఆశ చూపించి తెరాసలో చేర్చుకోలేదా?పార్టీ ఫిరాయింపుల ప్రకారం కేసులు పెట్టాలంటే ముందుగా కేసీఆర్‌పైనే పెట్టాలి. నలుగురు ఎమ్మెల్యేలు రావడం వల్ల మాకు ఒరిగేదేమీ ఉండదు. ఫాంహౌస్‌లో పట్టుబడ్డవారు భాజపా వాళ్లని ముద్ర వేస్తున్నారు. ఈ వ్యవహారంలో తెరాసకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ చేయించాలి. విఠలాచార్య సినిమాలా కేసీఆర్ తీరు ఉంది. ఆయన ఆడిన నాటకం అట్టర్ ఫ్లాప్ అవుతుంది.