ఆంధ్రప్రదేశ్లోనూ ఓటరు జాబితా సవరణకు షెడ్యూలు విడుదలైంది. ఇందులో ముఖ్యమైన తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 31 తేదీ వరకూ ఓటర్ల జాబితాను పరిశీలించి తనిఖీ కోసం సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకూ బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను తనిఖీ చేయనున్నారు. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 వరకూ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను కూడా చేపట్టనున్నారు. అక్టోబర్ 15న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయాలని, అనంతరం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ నెలన్నరపాటు అభ్యంతరాలను స్వీకరించాలని ఈసీ భావిస్తోంది. నవంబర్ 2, 3 తేదీల్లో ఓటర్ల నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సైతం చేపట్టనున్నారు. వచ్చిన అభ్యంతరాలను డిసెంబర్ 15 నాటికల్లా పరిష్కరించి.. డిసెంబర్ 31లోగా మార్పులతో, కొత్తగా నమోదు చేసుకున్న వారి పేర్లు చేర్చి.. ఓటరు జాబితా ముద్రించాలని నిర్ణయించారు. 2020 జనవరిలో తుది జాబితా విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల - voter list revision schedule
కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి నెలాఖరు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల వివరాలను ఈసీ పరిశీలించనుంది. అనంతరం మార్పులు, చేర్పులతో 2020లో తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటిస్తుంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో 3 కోట్ల 98 లక్షల మంది ఓటర్లు ఓటెయ్యగా, 10 లక్షల మంది కొత్తగా ఓటును నమోదు చేసుకున్నారు. 2018 అక్టోబరులో ముసాయిదా ప్రకటన చేసి, 2019 జనవరిలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. అయితే అదే సమయంలో పెద్ద ఎత్తున ఫాం 7ల దరఖాస్తులు వెల్లువెత్తటంతో వాటి పరిశీలనను నిలిపివేసిన ఈసీ, యధాతథంగా ఓటర్ల జాబితాలో మార్పులు లేకుండానే ఎన్నికల నిర్వహణ చేపట్టింది. ప్రస్తుతం ఈ దరఖాస్తుల పరిశీలన చేసిన అనంతరం 2020లో తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది.
ఇదీచూడండి.ప్రజా సమస్యలపై అధ్యయన కమిటీలు: పవన్