MERYLAND Lt Governor ARUNA MILLER : అమెరికాలోని మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన భారత సంతతి మహిళ అరుణ మిల్లర్ అసలు పేరు కాట్రగడ్డ అరుణ. ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో పని చేశారు. 1972లోనే వీరి కుటుంబం అమెరికా వెళ్లి స్థిరపడింది. అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అరుణ.. 1990లో అమెరికాకు చెందిన డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. అరుణమిల్లర్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలిగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. అంచెలంచెలుగా ఎదిగి లెఫ్టినెంట్ గవర్నర్ కావడంతో.. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో బంధువులు, గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసిన గ్రామస్థులు, బంధువులు మిఠాయిలు తినిపించుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అమెరికాలో అరుణ అరుదైన గౌరవం సాధించడం తమకు ఎంతో గర్వంగా తెలిపారు.
అరుణ చిన్నాన్న కాట్రగడ్డ నాగేశ్వరరావు కుటుంబం.. వెంట్రప్రగడలోని పూర్వీకుల ఇంట్లోనే ఇప్పటికీ నివసిస్తోంది. పొరుగుదేశంలో తెలుగు కీర్తిపతాకను అరుణ ఎగురవేశారని ఆమె బంధువులు వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఏడాదికోసారైనా అరుణ సొంతూరికి వస్తుంటారని తెలిపారు. అగ్రదేశంలో కీలకమైన రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణ మిల్లర్ ఎన్నికవడం తమ గ్రామానికే గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన తరుణంలోనే అగ్రరాజ్యం అమెరికాలోనూ ఓ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా కాట్రగడ్డ ఎన్నికై తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపచేశారని.. వెంట్రప్రగడ గ్రామస్థులు వ్యాఖ్యానించారు.