భవిష్యత్‌లో ఏపీ రాజధాని అంటే... మూడు పేర్లు చెప్పాలా..? - రాజధానిపై చంద్రబాబు వ్యాఖ్యలు
ఏపీ రాజధాని ఏదని ఎవరైనా అడిగితే మూడు పేర్లు చెప్పే పరిస్థితి వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉన్నాయంటే, అవమానంగా భావించే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీ రాజధాని ఏది అంటే ఏ పేరుతో మొదలు పెట్టాలి, ఏ పేరుతో ముగించాలి అని ఆయన ప్రశ్నించారు. రాజధాని అంటే ఏదో ఒక ఆఫీసు కట్టడం కాదని, భవిష్యత్‌ను తీర్చిదిద్దేదే రాజధాని అని స్పష్టం చేశారు. అందుకే ఆనాడు అందరికీ సమానమైన దూరంలో ఉంటుందనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా పెట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. చరిత్రలో ఒక ముఖ్యమంత్రి రాజధానిని మార్చిన సందర్భమే లేదని, అప్పట్లో తుగ్లక్ ఒక్కడే రాజధానిని మార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. వితండవాదంతో జగన్ కమిటీల మీద కమిటీలు వేశారని, రాజధాని అంటే యువత కలలకు వేదికగా ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన విద్యార్థి ఐకాస నేతలతో చంద్రబాబు మాట్లాడారు.
విజయవాడలో చంద్రబాబును కలిసిన ఐకాస విద్యార్థులు
.
Last Updated : Jan 3, 2020, 11:28 PM IST