YS Avinash Reddy : దివంగత ముఖ్యమంత్రి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ రెండోసారి విచారించింది. దాదాపు 4.30 గంటల పాటు ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆయన తన న్యాయవాదులతో కలిసి సీబీఐ విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించలేదు.. సుదీర్ఘ విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పానని అవినాష్‌రెడ్డి తెలిపారు. విజయమ్మ వద్దకు వెళ్లి బెదిరించి వచ్చానని దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. తాను దుబాయికి వెళ్లానని తప్పుడు ప్రచారం చేశారని, మీడియా ప్రచారం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతోందని అన్నారు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచేందుకు.. ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
విచారణకు మళ్లీ రావాలని సీబీఐ అధికారులు చెప్పలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వాస్తవాలను కాకుండా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ జరుగుతోందని ఆరోపించిన అవినాష్.. నాకు తెలిసిన నిజాలతో కూడిన విజ్ఞాపన పత్రం ఇచ్చానని చెప్పారు. విజ్ఞాపన పత్రంపై కూలంకషంగా విచారణ చేయాలని కోరానని తెలిపారు.
సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు..గూగుల్ టేక్ అవుటా.. టీడీపీ టేక్‌అవుటా.. అనేదాన్ని కాలమే నిర్ణయిస్తుందని అవినాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సీబీఐ అఫిడవిట్ అంశాలను టీడీపీ ఏడాదిగా ఆరోపిస్తోంది.. అవే ఆరోపణలు సీబీఐ కౌంటర్‌లో లేవనెత్తడంపై సందేహాలున్నాయని అన్నారు. వాస్తవాలు లక్ష్యంగా సీబీఐ విచారణ జరగడం లేదని, వ్యక్తి లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు ఉన్నదని అనుమానాలు వ్యక్తం చేశారు. వివేకా హత్య రోజు మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడానని గుర్తుచేశారు. ఆ తర్వాత రెండ్రోజుల తర్వాత కూడా మీడియాతో మాట్లాడానని అంటూ.. అప్పుడేమి మాట్లాడానో ఇవాళ కూడా అదే చెబుతున్నానని ఉటంకించారు. సీబీఐ అధికారులకూ అదే చెప్పా.. ఎవరు అడిగినా అదే చెబుతా అంటూ సమాధానమిచ్చారు. సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చి విచారిస్తున్నారు.. సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నానని చెప్పారు. ఘటనాస్థలంలో లభ్యమైన లేఖను ఎందుకు దాచారు? అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. లాయర్లను అనుమతించి ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోరినా.. ఇవాళ జరిగిన విచారణ రికార్డు చేసినట్లు కనిపించలేదని అవినాష్‌రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి :