ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్‌పై నోటీసులు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు వివరణ ఇవ్వాలని సీఎం జగన్‌కు, సీబీఐకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు నోటీసులు పంపింది.
కౌంటర్ దాఖలు చేయండి..
మరోవైపు బెయిల్ షరతులు ఉల్లంఘించారన్న పిటిషన్‌పై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని జగన్‌తో పాటు సీబీఐని కూడా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణ రాజు ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, కేసుల్లో సాక్షులుగా ఉన్న అధికారులు, ఇతరులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని పిటిషన్లో వివరించారు.
సహ నిందితులతో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి సాక్షులను ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రఘురామ పిటిషన్లో పొందుపర్చారు. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు చేసి, జైలుకు పంపించి కేసు విచారణ వేగంగా చేపట్టాలని ఆయన కోరారు.
మే 7న విచారణ..
రఘు రామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని తేల్చిన న్యాయస్థానం.. అభ్యర్థనను స్వీకరించింది. విచారణ ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి జగన్, సీబీఐకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. విచారణను మే 7కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి :పరీక్షల నిర్వహణను ఆపాలంటూ.. మోదీకి ఎంపీ రఘురామ లేఖ