వారంతా స్నేహితులు.. కలిసి వ్యాపారం చేశారు.. నష్టాలు రావటంతో ఎవరిదారి వారు చూసుకున్నారు. అయితే పెట్టుబడి పెట్టిన వ్యక్తి తనకు రావాల్సిన మెుత్తం ఇవ్వాలని మిగిలిన వారిని అడిగాడు.. వారి నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో పగను పెంచుకున్నాడు. ఎలాగైనా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. పథకం ప్రకారం లేని భూమిని సృష్టించాడు.దాన్ని అమ్మేందుకు మధ్యవర్తిత్వం చేస్తే.. భారీగా కమీషన్ వస్తుందని నమ్మించాడు. ఆ భూమిని కొనేందుకు పార్టీ దొరికిందనీ.. వారిని కలిసేందుకు రావాలని పిలిచాడు. ఆపై పథకం ప్రకారం వారిపై పెట్రోల్, శానిటైజర్‌ను పోసి నిప్పంటించి పారిపోాయడు. ఇదీ విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర, కారులో మనుషుల్ని పెట్టి చంపటానికి ప్రయత్నించిన నిందితుడు వేణుగోపాలరెడ్డి వేసిన స్కెచ్.
అసలు ఏం జరిగిందంటే...
ధింటకుర్తి గంగాధర్, అతని భార్య నాగవల్లికుమారి ప్రస్తుతం పాత కార్లు కొని.. అమ్మే వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఈ భార్యాభర్తలిద్దరితో పాటు నిందితుడు వేణుగోపాలరెడ్డి, వజ్రాల శిమరామకృష్ణారెడ్డి స్తిరాస్థి వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారంలో నష్టం రావటంతో.. ఎవరికి వారు విడిపోయి వ్యాపారం చేసుకుంటున్నారు. వారు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన నష్టంతో పాటు, తన దగ్గర తీసుకున్న అప్పు మెుత్తాన్ని సెటిల్ చేయమని వేణుగోపాలరెడ్డి.. గంగాధర్, శివరామకృష్ణారెడ్డిలను అడగ్గా.. వారు పట్టించుకోలేదు. దీంతో వారిపై పగను పెంచుకున్న వేణుగోపాలరెడ్డి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.