కృష్ణా జిల్లా కంకిపాడు - గుడివాడ మధ్య రహదారి నిరంతరం రద్దీగా ఉంటోంది. ఈ రహదారిలో కందేరు వద్ద రేవస్ కాలువపై వందేళ్ల క్రితం బ్రిటీష్ వారి హయాంలో వంతెన నిర్మించగా... పదేళ్ల క్రితం కూలిపోయింది. అప్పట్లో ఆ మార్గంలో ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో కూలిన బ్రిడ్జి పిల్లర్ల మీదే ఇనుప రాడ్లతో తాత్కాలిక వంతెన నిర్మించారు. ఈ మార్గం మీదుగా భారీ వాహనాలు వెళ్లడంతో మూడేళ్లలోనే బ్రిడ్జి దెబ్బతింది. కొన్ని చోట్ల ఇనుప రేకులు విరిగిపోగా.. మరికొన్ని తుప్పు పట్టి పెలుసుగా మారాయి. వంతెనపై పెద్ద రంద్రాలు ఏర్పడ్డాయి. ఇనుప రేకులు ఊడిపోయి ప్రమాదకరంగా పైకి లేచాయి. మరమ్మతుల లేక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతుండగా... పాదచారులు ఇనుప చువ్వలు తగిలి గాయాల పాలవుతున్నారు. పశువులు,గొర్రెలు కాళ్లకు రంద్రాలు పడుతున్నాయి. భారీ వాహనాలు దారి మళ్లించుకుని తిరిగి వెళ్తున్నాయి.
ప్రజల వినతులతో నాలుగేళ్ల క్రితం కొత్త వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది గత ప్రభుత్వం. ఏడాది వ్యవధిలోనే పనులు 90 శాతం పూర్తయ్యాయి. చివరి పిల్లర్లపై స్లాబు వేస్తే వంతెన అందుబాటులోకి వస్తుంది. పరిహారం ఇవ్వకుండానే కొందరి ఇళ్లు కూల్చివేయడం వివాదాస్పదమైంది. సమస్య కోర్టుకెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. వంతెన పూర్తైతే కష్టాలు తీరతాయని ఆశించిన పది గ్రామాల ప్రజలకు కష్టాలు తప్ప లేదు.