కళాశాల ఔదార్యం.. విద్యార్థుల కోసం బుక్ బ్యాంక్ - vijayawada
తమ పిల్లలు తమలా కాకుండా ఉన్నత చదువులు చదవాలని పేరున్న కళాశాలల్లో ఫీజు ఎక్కువైనా సరే చదివిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ పాఠ్య పుస్తకాల ధరలు ఎక్కువగా ఉండటంతో.. తల్లిదండ్రులు మరింత కష్టపెట్టడం ఇష్టం లేక విద్యార్థులు స్టడీమెటీరియల్స్ తోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని పోగొట్టాలని విద్యార్థినులకు ఉత్తమ విద్య అందించాలనే ఉద్దేశంతో బుక్ బ్యాంకును ఏర్పాటు చేసింది మారిస్ స్టెల్లా కళాశాల.

విజయవాడలో ఉన్న మారిస్ స్టెల్లా కళాశాల 1962 సంవత్సరం జూలై 16న ఫ్రాన్సిషన్స్ సిస్టర్స్ ఆఫ్ మేరీ స్థాపించారు. కళాశాల నాణ్యమైన విద్యను అందించడానికి, అన్ని రంగాల్లో విద్యార్ధులు రాణించడానికి ప్రోత్సాహం అందిస్తుంది. ఇక్కడ ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తున్నారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల్లో ఎక్కువమంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. పాఠ్యపుస్తకాలు ఎక్కువ ధర ఉండటంతో పేద విద్యార్థినులు కొనుగోలు చేయలేకపోతున్నారు. దీనిని గమనించిన కళాశాల యాజమాన్యం బుక్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఈ బుక్ బ్యాంకులో వివిధ కోర్సులకు సంబంధించిన పుస్తకాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడనుంచి పుస్తకాలను ఉచితంగా తీసుకొని చదువుకునే వెసులుబాటు కల్పించింది కళాశాల యాజమాన్యం. దీనివల్ల ఎంతోమంది విద్యార్థినులు పుస్తక భారం లేకుండా హాయిగా చదువుకుంటున్నారు. ఈ ఏర్పాటు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందంటూ విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.