వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రాష్ట్ర ప్రజలు నరకం చూస్తున్నారని తెదేపా నేత బొండా ఉమ అన్నారు. అసలే కరోనా వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఛార్జీల మోత మోగిస్తున్నారని విమర్శించారు. ప్రతి కుటుంబానికి రూ. 10వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. 3 నెలల కరెంట్ బిల్లులను రద్దు చేయాలని.. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయాలన్నారు.
విజయవాడలో తెలుగుదేశం పార్టీ 27వ డివిజన్ కార్యాలయాన్ని బొండా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఓపక్క కరోనాతో, మరోపక్క పనుల్లేక జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ హయాంలో అభివృద్ధితో సమానంగా సంక్షేమాన్ని అందించామని తెలిపారు. ఉచిత ఇసుక విధానం రద్దు చేసి వైకాపా నేతలు ఆదాయం కోసం భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని ఆరోపించారు.