ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్మాణంలో లోపాలు.. రోడ్డు ప్రమాదాలకు కారణాలు - red zones on roads news update

రహదారుల నిర్మాణంలో లోపాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏటా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కృష్ణా జిల్లావ్యాప్తంగా 150 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని నిపుణులు గుర్తించారు. రోడ్డు భద్రత నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మారడం లేదు. రహదారుల నిర్మాణానికి రూ. వందల కోట్లు వెచ్చిస్తున్నా.. భద్రత విషయంలో ప్రమాణాలు ఏ మాత్రం పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

block spots on roads at vijayawda
రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

By

Published : Apr 25, 2021, 1:42 PM IST

కృష్ణా జిల్లావ్యాప్తంగా రహదారుల నిర్మాణాల్లో లోపాలు.. రోడ్డు ప్రమాదాలకు కారమణమవుతున్నాయి. రోడ్ ఇంజనీరింగ్​లో లోపాల వల్ల ప్రయాణికులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారులు ఇరుకుగా.. వంపుగా ఉండడం, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయకపోవటం, రద్దీ ప్రాంతాల్లో వేగ నిరోధకాలు లేకపోవటం, తదితర కారణాలతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నగర కమిషనర్‌ పరిధిలో మొత్తం 110, కృష్ణా పోలీసు పరిధిలో 40 బ్లాక్‌స్పాట్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జిల్లా నుంచి ఐదు జాతీయ రహదారులు ఎన్‌హెచ్‌ 65, 16, 216, 165, 30లతో పాటు ఏడు రాష్ట్ర రహదారులున్నాయి. వీటి పరిధిలోని లోపాలను రవాణా, రహదారుల భద్రత, జాతీయ రహదారుల విభాగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి.. సరి చేయాల్సిన అవసరం ఉంది.

ప్రజలు నేరుగా జాతీయ రహదారిపైకి..

నగర శివారు ప్రాంతాల్లో విపరీతంగా జనాభా పెరిగింది. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై సర్వీసు రోడ్లు లేవు. అవసరాలకు అనుగుణంగా సమాంతరంగా సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లు నిర్మించలేదు. దీంతో ప్రజలు నేరుగా జాతీయ రహదారిపైకి రావాల్సి రావటం.. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం తాడిగడప - గంగూరు ప్రాంతాల మధ్య గతేడాది 64 ప్రమాదాలు జరిగాయి.

ప్రమాద కేంద్రాలుగా పలు ప్రాంతాలు..

రవాణా శాఖ అధికారులు రహదారుల లోపాలపై అధ్యయనం చేశారు. రామవరప్పాడు బల్లెంవారి వీధి, శ్రీశక్తి కల్యాణ మండలం, ఎస్‌ఆర్‌కే కళాశాల, కేసరపల్లి, గూడవల్లి, నిడమానూరు, తేలప్రోలు, వీరవల్లి కూడళ్లు.. చిన్నఅవుటపల్లి మూలమలుపు అత్యంత ప్రమాదకరంగా మారాయని నిపుణులు గుర్తించారు. జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లింపు మార్గాలతో కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని పలు ప్రాంతాలు ప్రమాద కేంద్రాలుగా మారాయి. ప్రధానంగా చిల్లకల్లు, అంబారుపేట అడ్డరోడ్డు, ఐతవరం, కీసర వంతెన సమీపం, బీరకలపాడు అడ్డరోడ్డు, తదితర ప్రాంతాలు ప్రమాదాలకు అడ్డాలుగా మారాయి. కంచికచర్లలోని బంకు సెంటర్‌ నుంచి చెవిటికల్లు సెంటర్‌ వరకు జాతీయ రహదారిపై కేవలం మూడు నెలల్లోనే 30 వరకు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

వంతెన డిజైన్‌ మార్చిన అధికారులు..

చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి జిల్లాలో 45 కి.మీ ఉంది. విజయవాడ నగరం నడిబొడ్డు నుంచి ఇది వెళ్తుంది. ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు ఇప్పటికే బెంజ్‌ సర్కిల్‌ వంతెన నిర్మించారు. ఇది ప్రమాదాలకు కేంద్రంగా మారింది. వంతెన పైనుంచి వచ్చే వాహనాలు, కింద నుంచి వచ్చేవి కలిసేచోటు ఇరుకుగా ఉండటం.. ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీన్ని గుర్తించిన అధికారులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రెండో భాగం వంతెన డిజైన్‌ మార్చారు.

ఇరుకిరుకుగా ఉండడంతో ప్రమాదాలు..

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిలో భాగమైన కనకదుర్గ వంతెన గతేడాది ప్రారంభమైంది. హైదరాబాద్‌ వెళ్లే వైపు భవానీపురం వద్ద వంతెన ముగుస్తుంది. ఈ ప్రాంతంలో పక్క నుంచి వచ్చే అప్రోచ్‌ రోడ్డు కూడా కలుస్తుంది. ఇది ఇరుకిరుకుగా ఉండడంతో వంతెన పైనుంచి వచ్చే వాహనాలు, అప్రోచ్‌ రోడ్డు నుంచి వచ్చేవి ఢీ కొంటున్నాయి. ఇప్పటివరకు పెద్ద ప్రమాదాలు జరగకపోయినా.. ఈ లోపాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చూడండి...

కరోనాతో ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారా.. ఇంటికే ఆసుపత్రి!

ABOUT THE AUTHOR

...view details