గ్రేటర్ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు అండగా ఉండి 48 స్థానాల్లో గెలిపించడం ఆనందంగా ఉందని తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఇచ్చినా... కార్యకర్తలు అంతా ఐక్యంగా పోరాడారని వ్యాఖ్యానించారు. ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించి... అభ్యర్థులను ఖరారు చేసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదారుల్లో గెలిచేందుకు తెరాస అన్ని ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ తెరాస చెప్పుచేతల్లో నడిచిందని ఆరోపించారు.
విశ్వాసం పెరిగింది..
జాతీయ నాయకుల రాకతో తెలంగాణలో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని బండి పేర్కొన్నారు. ప్రతి ఎన్నికను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందన్నసంజయ్... సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం ఉపయోగపడిందన్నారు. గ్రేటర్లో భాజపా ఓటు శాతం 10 నుంచి 35.56కు పెరిగిందని స్పష్టం చేశారు. తెరాసపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో.. భాజపాపై ఎంత విశ్వాసం ఉందో ఓట్ల శాతాలే చెబుతున్నాయన్నారు. యువతలో పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు.
పిరికితనం కాదు..
చాలా స్థానాల్లో తక్కువ మెజారిటీతో ఓడిపోయాని... ఎస్ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే మరో 25 స్థానాలు, ఎన్నికలకు తగినంత సమయం ఇచ్చి ఉంటే 100 స్థానాలు గెలిచేవాళ్లమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్దే తమ లక్ష్యం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ తీరు మార్చుకోకపోతే... ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. భాజపా కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా బావించ వద్దని హితవు పలికారు.