రామతీర్థంలో వైకాపా, తెదేపా నాయకులకు లేని ఆంక్షలు భాజపా పైనే ఎందుకని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నిచారు. భాజపా కన్నెర్ర చేస్తే... ప్రాంతీయ పార్టీలు అడ్రెస్ లేకుండా పోతాయన్నారు. నిన్న రామతీర్థంలో జరిగిన పరిణామాలను కేంద్రం, పార్టీ పెద్దలకు వివరించామని తెలిపారు. కిషన్రెడ్డి, సోము వీర్రాజు అడిగి వివరాలు తెలుసుకున్నారని, అమిత్ షాకు కూడా వినతిపత్రం ద్వారా పరిస్థితిని వివరిస్తామన్నారు. తమకు అనుమతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... 7వ తేదీన ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని ఆయన దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కమిటీలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీలో హిందూ మతంపై దాడి జరుగుతుంటే... అన్నిమతాలతో కమిటీలు ఎందుకని జీవీఎల్ నరసింహారావు నిలదీశారు. ఇతర మతాల పెద్దలు, కమిటీలు ఈ దాడులను ఎందుకు ఖండించరని ప్రశ్నించారు.. కమిటీలలో అన్ని మతాల నుంచి ప్రతినిధులు ఉంటారని చెబుతున్నారన్నారు. ఏపీలో తొంభైశాతం హిందువులు ఉన్నారని, హిందూ మతం పై దాడి చేస్తే ఇతర మతస్థులు కమిటీలలో ఉండి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఓ మతంపై మరో మతం వారు దాడి చేయడం లేదని, అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని... వారి మధ్య విద్వేషాలు సృష్టించ వద్దని హెచ్చరించారు.